- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు వరంగా హెల్త్ స్కీం.. ప్రతిపాదనను రూపొందించిన ఉద్యోగుల జేఏసీ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతన ఈహెచ్ఎస్ విధానం అమలు కోసం ఒక ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, జేఏసీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రస్తుతం అమలవుతున్న హెల్త్ స్కీంలో ఉన్న లోటు పాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీంతో ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వానికి వచ్చే మంచిపేరు గురించి మంత్రికి వివరించారు. కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి భారం లేకుండా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు పడుతున్న కష్టనష్టాల గురించి మంత్రికి వివరించారు. వెంటనే జీవో నెంబర్ 317 ను రద్దుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు.
ప్రస్తుత విధానంతో సమస్యలు
ప్రస్తుత మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం వల్ల ఆపద సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్న రిఫరెల్ హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుంది. చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆసుపత్రుల్లో కట్టాల్సి ఉంటోంది. ఒకవేళ ఇంటికి పెద్ద అయిన ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రూ.2 లక్షలకే పరిమితం చేసే సీలింగ్ ఉంది. చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే రిలాక్సేషన్ పొందేందుకు స్టాండింగ్ కమిటీని ఆశ్రయించాల్సి వస్తుంది. చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన తర్వాత మళ్లీ ఆ డబ్బులను ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు(రీయింబర్స్‌మెంట్) ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతున్నది.
పీఆర్సీ 2018 చేసిన సిఫార్సు
మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానంలో ఈహెచ్ఎస్ అమలు కోసం 2018 పీఆర్సీ ఒక ప్రతిపాదన చేసింది. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల, పింఛనర్ల బేసిక్ పే నుంచి ఒక శాతాన్ని వసూలు చేయాలని సూచించింది. కొన్ని ఉద్యోగ సంఘాలు, కొందరు ఉద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధిక వేతనం ఉన్న వారి నుంచి 1 శాతం వసూలు చేయడం చాలా ఎక్కువని కొందరు అన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్యక్రమంలో డా.నిర్మల, కె.రామకృష్ణ, డా.కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, డా.వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేష్ పాక, రామ్ ప్రతాప్ సింగ్, గోవర్ధన్. పాండు, దీపక్ లు పాల్గొన్నారు.
ప్రతిపాదనల్లో కీలకాంశాలు
- తెలంగాణలో ప్రస్తుతం 3,06,000 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2,88,415 పింఛనర్లు ఉన్నారు.
- ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం నెలకు రూ.40 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది.
- నూతన ఈహెచ్ఎస్‌లో ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి నగదురహిత వైద్యం అందించాలి.
- వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితి(సీలింగ్) విధించవద్దు.
- అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ విధానం అమలు చేయాలి.
- ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనర్లు చెల్లించే మొత్తం వారి పే స్లిప్ లేదా పింఛన్ స్లిప్‌లో 'డిడక్షన్స్'గా నమోదు కావాలి. ప్రభుత్వం చెల్లించే మొత్తం కూడా 'ఎర్నింగ్స్'లో నమోదు చేయాలి.
- సంబంధిత డీడీఓ లేదా పీఆర్ఓ ఈ మొత్తాన్ని ప్రతినెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలి.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ కమిటీ ఈహెచ్ఎస్ అమలును పర్యవేక్షించాలి.