ఓయూలో మెయింటెనన్స్ నిల్.. హాస్టల్ పైకప్పులకు పగుళ్లు

by Javid Pasha |
ఓయూలో మెయింటెనన్స్ నిల్.. హాస్టల్ పైకప్పులకు పగుళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. క్యాంపస్ లో మెయింటెనన్స్ కు కూడా నిధులు కేటాయించడంలేదు. మెస్ సైతం శిథిలావస్థలో ఉంది. హాస్టల్ పైకప్పులకు కూడా పగుళ్లు వచ్చాయి. దీంతో భారీ వర్షానికి గదుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. విద్యార్థులు రాత్రి పడుకునేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు పైకప్పుల నుంచి గదుల్లోకి రాకుండా విద్యార్థులే తమ సొంత ఖర్చులతో పరదాలు తెచ్చుకుని నీరు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వర్సిటీ వైస్ చాన్స్ లర్ నిధులు సైతం కేటాయించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఓయూ పరిధిలో మొత్తం 9 హాస్టళ్లు ఉన్నాయి. అందులో ఎన్ఆర్ఎస్, ఓల్డ్ పీజీ, న్యూ పీజీ, మంజీరా, టెక్నాలజీ, ఈ1, ఈ2, డీ, గోదావరి, మినీ టెక్నాలజీ భవనాలున్నాయి. కాగా వాటిలో ఎన్ఆర్ఎస్, ఓల్డ్ పీజీ, న్యూ పీజీ, మంజీరా, టెక్నాలజీ, ఈ1, ఈ2, డీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని స్కాలర్లు చెబుతున్నారు. గోదావరి, మినీ టెక్నాలజీ భవనాలు మాత్రమే కాస్తో కూస్తో పర్లేదు అన్నట్లుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇతర భవనాలకు సీలింగ్ పెచ్చులు ఊడటంతో పాటు పలు హాస్టళ్ల పైకప్పులుగా ఉన్న రేకులు ధ్వంసం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతు పనులు చేపట్టాలని వీసీకి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. నూతన భవనాల ఏర్పాటు సాకుతో వీసీ మరమ్మతు పనులు చేపట్టడం లేదని మండిపడుతున్నారు. నూతన భవనాలు కట్టేదెన్నడు? అందులో విద్యార్థులు వెళ్లేదెప్పుడు అని స్కాలర్లు ప్రశ్నిస్తున్నారు. అప్పటి వరకు ఇందులో ఉండేదెలా అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలోని ఈ1, ఈ2, డీ హాస్టళ్లలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. హాస్టల్ మెయింటెనన్స్ కోసం రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా కేటాయించింది లేదని ఓయూ స్కాలర్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మెయింటెనన్స్ లేకపోవడంతో హాస్టల్ లో పాములు, తేళ్లు, దోమలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. గతంలోనూ పలువురు పాముకాటుకు గురైన దాఖలాలు ఉన్నాయని స్కాలర్స్ వెల్లడించారు. వర్సిటీ వైస్ చాన్స్ లర్ విద్యార్థులకు ఉపయోగపడే పనులు ఒక్కటీ చేయడంలేదని స్కాలర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లైటింగ్ కు రూ.కోటి ఖర్చు పెట్టిన వీసీ భవనాల కోసం ఖర్చు చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మెస్ గదుల పైకప్పులు పగిలిపోవడంతో వర్షంలోనే వంట వండుతున్నారని పేర్కొన్నారు. మరమ్మతు పనులు అయినా చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఉద్యమకార్యాచరణకు పిలుపివ్వబోతున్నట్లు విద్యార్థి సంఘాలు నేతలు తెలిపారు. వర్షం కారణంగా దీన్ని వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే సోమవారం నుంచి ఆందోళనలను చేపట్టనున్నట్లు తెలిపారు.

రూపాయి ఖర్చు చేయలేదు.. భీంరావు నాయక్, నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్

ఉస్మానియా వర్సిటీలో హాస్టల్ మెయింటెనన్స్ కోసం వైస్ చాన్స్ లర్ రెండేండ్ల నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. భవనాలు శిథిలావస్థలో ఉండటంతో పాములు, తేళ్లు, దోమల కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. గతంలో ఉన్న వీసీలు మెయింటెనన్స్ కోసం నిధులు కేటాయించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. హాస్టల్ రూమ్స్ తో పాటు డార్మెటరీ సైతం ధ్వంసమైంది. పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదు. భవిష్యత్ లో యుద్ధ ప్రాతిపదికన ఉద్యమాలు చేపడుతాం.


Advertisement

Next Story