Loan waiver: వచ్చే వారం సెకండ్ ఫేజ్ రుణమాఫీ అమలుకు సర్కార్ సిద్ధం

by Mahesh |
Loan waiver: వచ్చే వారం సెకండ్ ఫేజ్ రుణమాఫీ అమలుకు సర్కార్ సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు రుణమాఫీ సెకండ్ ఫేజ్ అమలుకు ముహూర్తం ఖరారైంది. లక్షన్నర వరకు అప్పులున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో వచ్చే వారం జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అవసరమైన నిధులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయగానే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు మాత్రం జూలై 28 లేదా ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా డిపాజిట్ చేయడానికి వనరులను రెడీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా మొదటి ఫేజ్‌లో మొత్తం 11.50 లక్షల మంది లబ్ధిదారుల్లో 17,877 మంది బ్యాంకు ఖాతాల్లో ఏర్పడిన సాంకేతిక చిక్కుల కారణంగా రుణమాఫీ డబ్బులు డిపాజిట్ కాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు వివరించారు.

రెండో విడత రుణమాఫీ ని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు మాఫీ చేయాలని భావించి లబ్ధిదారుల వివరాలను రెడీ చేశామని, కానీ అందులో కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన టెక్నికల్ సమస్యలు రావడంతో సాధ్యం కాలేదన్నారు. రుణమాఫీ డబ్బులు రిజర్వ్ బ్యాంకుకు చెందిన ఈ-కుబేర్ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ అవుతున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో రూ. 84.94 కోట్లు (17,877 రైతు ఖాతాలు) లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకుండా రిటన్ అయ్యాయని, ఆ నిధులు ఆర్బీఐ దగ్గరే ఉండిపోయాయని తెలిపారు. టెక్నికల్ సమస్యలను సవరించిన తర్వాత ఆర్బీఐ నుంచి డబ్బులు తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి తుమ్మల వివరించారు.

కొద్దిమంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు (సీడెడ్ సంఘాలు), గ్రామీణ బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారని, వాటికి ఆర్బీఐ తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా చెల్లిస్తుందని, ఆ లబ్ధిదారుల వివరాలను బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించామని, మొత్తం 15,781 ఖాతాలు ఉన్నట్లు తేలిందన్నారు. వాటి తనిఖీ దాదాపు పూర్తయిందన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ ఖాతాల్లో కూడా ఫస్ట్ ఫేజ్ రుణమాఫీ నిధులను జమ చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed