రెగ్యులరైజేషన్ ​సర్టిఫికేట్లన్నీ ఎంక్వైరీ...!

by Javid Pasha |
రెగ్యులరైజేషన్ ​సర్టిఫికేట్లన్నీ ఎంక్వైరీ...!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో రీసెంట్​గా రెగ్యులరైజేషన్​ చేసిన ఉద్యోగుల సర్టిఫికేట్లన్నీ రీ వెరిఫికేషన్​ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ రెగ్యులర్​ జాబితాలోకి చేరిన హెల్త్​ అసిస్టెంట్లు(ఎంపీహెచ్​ఏ– మేల్​) లపై ఫోకస్​పెట్టింది. రెగ్యులరైజేషన్​పొందినోళ్లలో కొందరు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినట్లు అనుమానాలు రావడంతో వైద్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. అన్ని జిల్లాల డీఎమ్ హెచ్​వోలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అన్ని జిల్లాల్లోని ఎంపీహెచ్​ఏ –మేల్ ఉద్యోగస్తుల సర్టిఫికేట్లను జిల్లా స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. మెజార్టీ మెంబర్లు బోగస్​ సర్టిఫికేట్లు దృవీకరించి రెగ్యులరైజేషన్​ పొందినట్లు మెడికల్ ​యూనియన్​ నాయకులు ఆరోపిస్తున్నారు. వైద్యశాఖలోని కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యంతోనే ఇలాంటివి జరుగుతున్నట్లు ఫైర్ అవుతున్నారు. దీని వలన ప్రభుత్వ సంస్థల్లో ట్రైనింగ్ పొందినోళ్లకు అవకాశం రావడం లేదనే చర్చ జరుగుతున్నది.

వాస్తవానికి ఎంపీహెచ్​ఏ పోస్టుకు శానిటరీ ఇన్​స్పెక్టర్​, మల్టీ పర్పస్​ హెల్త్​వర్కర్​ వంటి కోర్సుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా చేసి ఉండాలి. జీవో నెంబరు 273 ప్రకారం ఈ కోర్సు పరీక్షలు కూడా స్టేట్​ బోర్డుల పర్యవేక్షలో మాత్రమే జరగాలనేది రూల్. కానీ ఇప్పుడు రెగ్యులరైజేషన్ ​పొందినోళ్లలో మెజార్టీ ఉద్యోగులకు బోర్డు ద్వారా వచ్చిన సర్టిఫికేట్లు లేవనేది ఇదే సెక్టార్​కు చెందిన మరి కొంత మంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎంపీహెచ్​ఏ మేల్ విభాగంలో 837 మంది రెగ్యులర్​ కాగా, కేవలం 203 మంది మాత్రమే గవర్నమెంట్ సంస్థల నుంచి ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్లు తీసుకున్నట్లు చెబుతున్నారు. మిగతా 634 మంది ప్రైవేట్ సంస్థల నుంచి పొందినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది అర్హత లేని నాలుగు సంస్థల నుంచి సర్టిఫికేట్లు పొందినట్లు స్వయంగా హెల్త్ ఉద్యోగులే చెబుతున్నారు.

ఆయా సంస్థల సర్టిఫికేట్లు చెల్లవని గతంలో కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా.. కొందరు సిబ్బంది కుమ్మక్కై రెగ్యులరైజేషన్​ చేశారని ఉద్యోగ సంఘాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వలన ప్రభుత్వ సంస్థల్లో ట్రైనింగ్ పొందినోళ్లకు అవకాశం రావడం లేదని విమర్శిస్తున్నారు. ఇక 634 మంది ఉద్యోగుల్లో చాలా మంది ఒకే ఇయర్​ లో రెండు కోర్సులు చేసినట్లు తెలుస్తోన్నది. కొన్ని జిల్లాల్లో ని హెల్త్ డిపార్ట్​ మెంట్ స్టాఫ్​ అత్యుత్సాహం చూపి సర్టిఫికేట్లలోని కోర్సు ఆఫ్​ ఇయర్​ తేదిని కూడా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed