వాస్తవానికి విరుద్దంగా మాట్లాడుతున్న సీఎం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Mahesh |   ( Updated:2025-02-22 15:25:34.0  )
వాస్తవానికి విరుద్దంగా మాట్లాడుతున్న సీఎం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేపదే వక్రీకరిస్తే చరిత్ర మారిపోదని, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ, సీఎంగా వచ్చిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోతిరెడ్డి పాడుపై ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేస్తే కాంగ్రెస్ మంత్రులు నీళ్ల తరలింపునకు హారతి పట్టారని గుర్తు చేశారు. నారాయణ పేట, వికారాబాద్ లలో పర్యటించినపుడు సీఎం ఏదైనా ప్రకటిస్తారని ప్రజలు ఆశించారని, ఏం ప్రకటించకుండా కేసీఆర్ పై ఎప్పటి మాదిరిగానే అసభ్య భాషలో నిందించారన్నారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన భవనాలను సీఎం రేవంత్ ప్రారంభించారని, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చేయాల్సిన ప్రారంభాలను సీఎం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పది నెలలుగా పని చేస్తున్న పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించి, ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో వెళ్తున్న సీఎం రేవంత్ మమ్మల్ని చర్చకు రమ్మంటున్నారని వాపోయారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను అడ్డంకులమధ్య కేసీఆర్ రాష్ట్ర సొంత నిధులతో దాదాపుగా పూర్తి చేశారన్నారు. పన్నెండు వందల కోట్ల రూపాయల తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని, అయినా పది నెలలుగా రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు ను రేవంత్ నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఉద్దండపూర్ ద్వారా గ్రావిటీ కాలువ ద్వారా కొడంగల్ కు నీళ్లు ఇవ్వొచ్చని, అయినా కొడంగల్ నారాయణ్ పేట లిఫ్ట్ తెచ్చారని తెలిపారు. అరుపులు పెడ బొబ్బలతో కేసీఆర్ చేసిన అభివృద్ధిని రూపుమాపుతావా ?.ఎక్కడికి వెళ్లినా సీఎం అని మరచి రేవంత్ కేసీఆర్ పై ఇష్టానుసారంగా తిట్ల పురాణం అందుకుంటున్నారని వాపోయారు.

కేసీఆర్ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తే ఏం లాభం ఉండదని, కేసీఆర్ కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ (Police Command Control) నుంచి పాలన చేస్తూ కేసీఆర్ ను విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్ కట్టిన వాటిని ప్రారంభం చేస్తూ కేసీఆర్ ను తిట్టడం సరైంది కాదన్నారు. కులగణన తానే చేశాను అన్నట్టుగా రేవంత్ మాట్లాడుతున్నారని, వేరే రాష్ట్రాలు కూడా కులగణన చేశాయని గుర్తు చేశారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయని, పంటలకు నీళ్లివ్వలేమని చెప్పేందుకేనా కోదండరెడ్డికి కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చింది అని సెటైర్లు వేశారు. ఆ పదవి వదులుకుని కోదండరెడ్డి కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి తీసుకుంటే మంచిదని సూచించారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ వైఎస్ కు ఊడిగం చేశారని రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వాపోయారు. చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టులను పరిహసించారని, ఆయన శిష్యుడిగా రేవంత్ అదే చేస్తున్నారన్నారు.

Next Story