CM Revanth: విభజన సమస్యలపై మనకు లాయర్

by Gantepaka Srikanth |
CM Revanth: విభజన సమస్యలపై మనకు లాయర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ఏఐసీసీ ఎంపిక చేయడాన్ని బలపరుస్తూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఏఐసీసీకి ఈ తీర్మానం ద్వారా సీఎల్పీ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన నగర శివారులోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ఆయన రాజ్యసభ సభ్యుడు కావాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఈ పదేండ్లలో శ్రద్ధ చూపలేదని ఆరోపించిన సీఎం రేవంత్... అనేక రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయన్నారు. చట్టంలోని అంశాలను చట్టసభల్లో ఎంత బలంగా వినిపించాల్సిన అవసరం ఉన్నదో న్యాయస్థానాల్లోనూ అంతే గట్టిగా వాదించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఇకపైన కోర్టుల్లో విభజన చట్టానికి సంబంధించిన వ్యాజ్యాలపై సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన అభిషేక్ సింఘ్వి తెలంగాణ తరఫున గట్టిగా వాదిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని రాష్ట్రం తరఫున ఏఐసీసీకి విజ్ఞప్తి చేశామని, వెంటనే సానుకూలంగా స్పందించిందని గుర్తుచేశారు. ఇంతకాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం ఒకవైపు రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో, మరోవైపు న్యాయవాదిగా న్యాయస్థానాల్లో గొంతు విప్పుతారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాజ్యసభ సభ్యుడు తన పదవికి రాజీనామా చేశారని, ఆయన నిర్ణయంతోనే ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలో సింఘ్వి గెలవబోతున్నారని అన్నారు. కేశవరావు నిర్ణయానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.

నామినేషన్ వేయడానికి ఒక రోజు ముందు రాష్ట్రానికి చేరుకున్న అభిషేక్ మను సింఘ్వికి సలహాదారు హర్కర వేణుగోపాల్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ప్రజాభవన్‌కు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తోనూ భేటీ అయ్యారు. అనంతరం కేశవరావు నివాసానికి వెళ్ళి కొద్దిసేపు ముచ్చటించారు. సీఎల్పీ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక బీఆర్ఎస్ పనిగట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నదని, క్షేత్రస్థాయిలో వాటిని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి ఖాళీ ఖజానాను అంటగట్టినా అనేక ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటూనే ఆరు గ్యారంటీలను, రైతు రుణమాఫీని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాలని కోరారు.

తొందర్లోనే రైతు కృతజ్ఞత సభ

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ వేదికగా 2022 మే 6న రాహుల్‌గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్‌లోని హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేశామని, విజయోత్సవ సభగా అదే వేదికపై రాహుల్‌గాంధీ హాజరయ్యే కృతజ్ఞతా సభకు ఇంకా తేదీలు ఫిక్స్ కాలేదని, తొందర్లోనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తొలుత ఈ నెల 20న నిర్వహించాలని భావించామని, కానీ అనుకున్నట్లుగా డేట్‌లు ఖరారు కాకపోవడంతో వాయిదా వేసుకున్నామని సీఎం వివరణ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణతో పాటు రైతు కృతజ్ఞతా సభ తొందర్లోనే ఉంటుందని, ముఖ్య అతిథులుగా వచ్చే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని ఢిల్లీ వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు.

అభిషేక్ మను సింఘ్వీరి రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించామని, ఎమ్మెల్యేలంతా ఆయనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. సిటీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలంతా సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలను, రాజ్యసభ సభ్యులను ఆయనకు పరిచయం చేసి వారితో మర్యాదపూర్వక భేటీని ఏర్పాటుచేశామన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో న్యాయం జరిగే వరకు మాట్లాడుతూనే ఉంటానని అన్నారు. చట్టంలో పేర్కొన్న అంశాలను సాధించేందుకు అట చట్టసభల్లో, ఇటు న్యాయస్థానాల్లో అభిషేక్ సింఘ్వి గొంతెత్తుతారని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Next Story