TGSRTC: మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు.. టికెట్ ధరల సవరణ ఎంతో తెలుసా?

by Ramesh N |
TGSRTC: మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు.. టికెట్ ధరల సవరణ ఎంతో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 26న మహాశివరాత్రి కాగా, 24 నుంచి 28 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714 ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఇవాళ టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్‌సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఈ నెల 24 నుంచి 27 వరకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ చార్జీలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 26 నుంచి 28 తేదీ వరకు సవరణ చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ప్రయాణికులకు సమాచారం నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. గత శివరాత్రి కన్నా ఈ సారి 809 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది.

భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar) కోరారు. స్పెషల్ బస్సుల్లో జీవో ప్రకారం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్టినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మీ-మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నగరం నుంచి శ్రీశైలం, వేములవాడకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని వెల్లడించారు.

Next Story