- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt.: నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఆ ప్రాజెక్ట్‌కు ఏఏఐ గ్రీన్ సిగ్నల్

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, ప్యారడైస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు, జేబీఎస్ నుంచి రాజీవ్ రహదారి వరకు సాఫీగా ప్రయాణం సాగేందుకు రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ప్యారడైస్ నుంచి డెయిరీ ఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌లో మంగళవారం కీలకఘట్టం ముగిసింది. కారిడార్‌లో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ కారిడార్‌లోని ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.
రూ.652 కోట్లతో 5.4 కి.మీ కారిడార్
జాతీయ రహదారి 44 లోని హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు ఆరు లైన్లు విస్తరించనుండగా ఆ మార్గంలో ముఖ్యమైన ప్రాంతాలైన తాడ్ బండ్ జంక్షన్, బోయినిపల్లి జంక్షన్‌లతో కలిపి 5.4 కిలో మీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.652 కోట్లతో ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే జాతీయ రహదారి 44లోని మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిమాజాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. దీంతో పాటు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సైతం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. నగరం నుంచి వచ్చే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వైపు వెళ్లడానికి సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రూ.50 కోట్లతో అండర్ గ్రౌండ్ టన్నెల్
సికింద్రాబాద్ నుంచి బోయినిపల్లి వెళ్లేందుకు తాడ్ బండ్ జంక్షన్‌లో ట్రాఫిక్ అధికంగా ఉండడంతో కారిడార్ పనులు చేపట్టడానికి కష్టమవుతుందని భావించిన అధికారులు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రన్ వే కింది నుంచి (భూగర్భంలో నుంచి) 600 మీటర్ల పోడవు టన్నెల్ నిర్మించనున్నారు. అయితే ఈ టన్నెల్ బాలంరాయ్ వద్ద ప్రారంభం కానుంది. 600 మీటర్ల టన్నెల్‌లో 400 మీటర్లు రన్‌వే కింది నుంచి పోతుంది. దీనికి సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు సికింద్రాబాద్ నుంచి ఎయిర్‌పోర్ట్ అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి నేరుగా బోయినిపల్లి జంక్షన్‌కు వెళ్లడానికి సులభంగా ఉంటుంది.
40 కి.మీ వేగమే
ఎలివేటెడ్ కారిడార్ బోయినిపల్లి జంక్షన్‌లో ఎగ్జిట్, ఎంట్రీ ర్యాంపులు నిర్మించాలని నిర్ణయించారు. 8 మీటర్ల వెడల్పుతో ఎగ్జిట్ ర్యాంపు 0.248 కి.మీ, ఎంట్రీ ర్యాంపు 0.475 కి.మీ నిర్మించనున్నారు. దీనిపై గంటలకు 40 కి.మీ వేగంతో వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్యారడైస్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు నిర్మించనున్న 5.4 కి.మీ కారిడార్, జేబీఎస్ నుంచి హకీంపేట మీదుగా శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ను కలిపే ఎలివేటెడ్ కారిడార్ పనులకు హెచ్ఎండీఏ వారం రోజుల్లో టెండర్ నోటిఫికేషన్ జారీచేయనుంది. వీటికి సంబంధించిన భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రక్షణ శాఖకు చెందిన భూములను సేకరించే పనులు జరుగుతున్నాయి.