- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG BED: బీఈడీ ఇక నుంచి ఏడాదే..! NCTE కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాది బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విద్యను పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో 2014 డిసెంబర్‌లో ఏడాది బీఈడీ కోర్సును నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దశబ్దకాలం తర్వాత ఎన్‌సీటీఈ తిరిగి ఈ (ఏడాది బీఈడీ) డెసిషన్ తీసుకున్నది.
నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్, రెండేళ్ల పీజీ విద్యార్థులకే..
ఏడాది బీఈడీ కోర్సు కేవలం నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్, రెండేండ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడేండ్ల యూజీ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది వర్తించదు. రెండేండ్ల బీఈడీ ప్రోగ్రామ్‌లను అందించే సంస్థలు 2030 నాటికి మల్టీ డిసిప్లీనరీ ఇన్‌స్టిట్యూట్‌లుగా మారాల్సి ఉంటుందని ఇటీవలే ఎన్‌సీఈటీఈ చైర్మన్ పంకజ్ అరోరా స్పష్టం చేశారు.
ఎన్‌సీటీఈ 2025 ముసాయిదాపై చర్చ
కేంద్ర విద్యాశాఖతో కొన్ని నిర్ణయాలపై ఎన్‌సీటీఈ చర్చిస్తున్నదని, పబ్లిక్ కన్సల్టేషన్ కోసం ఎన్‌సీటీఈ నిబంధనలు - 2025 పేరుతో ముసాయిదాగా మార్చేందుకు విస్తృతమైన కృషి చేస్తున్నామని చైర్మన్ పంకజ్ అరోరా వెల్లడించారు. ఇప్పటికే ఏడాది బీఈడీ ప్రోగ్రామ్‌కు సంబంధించి వివిధ కోర్సుల ఫ్రేమ్స్‌ను ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కింద చేపట్టిన నాలుగేండ్ల డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులను మరింత విస్తరించాలని పాలక మండలి భేటీలో నిర్ణయించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 64 సంస్థల్లో బీఏ, బీఈడీ, బీకామ్-బీఈడీ, బీఎస్సీ- బీఈడీ కోర్సులను అందిస్తుండగా.. వీటిలో యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో పాటు సంస్కృతం, ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్‌తో పాటు భాష, చరిత్ర వంటి ప్రత్యేక సబ్జెక్ట్‌లు, సంగీతం, గణితం, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, లాంటి కోర్సులను భాగం చేయనున్నారు. ప్రస్తుతం పునరుద్ధరించనున్న ఏడాది బీఈడీ కోర్సులో నూతన జాతీయ విద్యావిధానం -2020కి అనుగుణంగా మార్పులు చేసేందుకు ఎన్‌సీఈటీ కసరత్తు చేస్తున్నది. పాలకమండలి, కేంద్ర విద్యాశాఖ సంప్రదింపుల తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది.