- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం.. 15 నిమిషాలు అసెంబ్లీ వాయిదా

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ అధికార, విపక్ష సభ్యల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ సభలో చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణం అయ్యాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు. ప్రసంగం చదివేటప్పుడు గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుందోనని కామెంట్ చేశారు. రైతుల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతుండగానే అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినానాదాలు చేయడంతో జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
ముందు రన్నింగ్ కామెంట్రీ ఆపి.. మూసుకుని కూర్చోవాలని సీరియస్ అయ్యారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ కలుగజేసుకుని గవర్నర్‌కు గౌరవం ఇవ్వాలని.. ఇదేం పద్ధతి అని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని వివరంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించింది తాము కాదని కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వైఫల్యాను తమ సభ్యులు చెప్పారని అందులో తప్పేమి ఉందని అన్నారు. గత పదేళ్లలో చేయలేనిది తాము ఏడాదిలోనే చేసి చూపించామని పేర్కొన్నారు. ఇంతలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ కలుగజేసుకుని గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని జగదీశ్ రెడ్డికి సూచించారు.
బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావొద్దని.. సభా సంప్రదాయాలను పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించకూడదని సూచించారు. అయితే, స్పీకర్ వ్యాఖ్య పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. సభా సంప్రాదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని, సభ స్పీకర్ సొంతం కాదని జగదీశ్ రెడ్డి కామెంట్ చేశారు. తనను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ అనగా.. సభలో జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తేలాకే మాట్లాడతానని జగదీశ్ రెడ్డి బదులివ్వగా.. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.