- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Assembly: అసెంబ్లీ సెషన్స్ టూ డిఫరెంట్.. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కో-ఆర్డినేషన్

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి అసెంబ్లీ సమావేశాలు గతంలో కంటే భిన్నంగా కొనసాగాయి. అధికార పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేలు,మంత్రుల మధ్య సమన్వయం కనిపించింది. విపక్షాలను కట్టడి చేసేందుకు కలిసికట్టుగా గళం విప్పారు. విప్‌లు సైతం తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెండ్ వేటు పడటంతో బీఆర్ఎస్ సభ్యులు కాస్త దూకుడు తగ్గించారు. పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించకుండా స్వీయ నియంత్రణ పాటించారు.
సీఎం కౌన్సిలింగ్‌తో కనిపించిన మార్పు
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం తరువాత జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సభలో ఎలా వ్యవహరించాలి? మంత్రులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలపై సభ్యులకు, విఫ్ లకు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆ ఎఫెక్ట్ మరుసటి రోజు నుంచి జరిగే సమావేశాల్లో కనిపించింది. బీఆర్ఎస్ సభ్యుల రన్నింగ్ కామెంట్రీకి కౌంటర్లు ఇవ్వడం, ఆ పార్టీ సభ్యులు చేసే విమర్శలకు గట్టిగా ఆన్సర్ ఇచ్చేందుకు పోటీలు పడ్డారు.
మంత్రుల మధ్య సమన్వయం
గత అసెంబ్లీ సమావేశాల్లో సభలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై మంత్రుల మధ్య కో అర్డినేషన్ లేకపోవడంతో కొన్ని సార్లు విపక్షాలు పైచెయ్యి సాధించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈసారి మాత్రం అపోజిషన్ సభ్యులను కట్టడి చేసే విషయంలో మంత్రులు,ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేశారని ప్రశంసలు వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో మంత్రులు,ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేశారు. స్పీకర్ కు జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు,ఆయన్ను సభకు రాకుండా సస్సెండ్ చేయాలని ముక్తకంఠంతో గళం విప్పారు. అలాగే ఎమ్మెల్యే కేటీఆర్ 30 శాతం కమిషన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారంటూ చేసిన ఆరోపణల విషయంలో సైతం అధికార పార్టీ సభ్యులు ఒకేసారి విపక్షంపై ఎటాక్ చేశారు. దీనితో సభనుంచి బీఆర్ఎస్ పక్షం వాకౌట్ చేసి బయటికివెళ్లారు.
వెంటాడిన వేటు భయం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రసంగం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ సైతం ఆయన కామెంట్స్ పై మనస్తాపం చెందారు. చివరికి జగదీశ్ రెడ్డిపై సస్పెన్స్ వేటు వేశారు. అప్పట్నించి బీఆర్ఎస్ సభ్యులు తమ దూకుడును తగ్గించుకున్నారు. గతంలో ప్రతి విషయంలో పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేసే సభ్యులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. ఒకవేళ పోడియం వద్దకు వెళ్తే సభనుంచి సస్పెండ్ చేస్తారనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులు స్వీయ నియంత్రణ పాటించారని చర్చ జరిగింది
అన్ని పద్దులపై డిస్కషన్
ఈసారి ప్రశ్నోత్తరాల సమయం కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగింది. ప్రభుత్వం ఇరుకున పడుతోందని భయంతోనే క్వశ్చన్ అవర్ ను రద్దు చేశారని బీఆర్ఎస్ నుంచి విమర్శలు ఉన్నాయి. అయితే జీరో అవర్ కు ఎక్కువ సమయం కేటాయించారు. దాదాపుగా కొత్త సభ్యులు అందరూ ఆ అవర్ ను వినియోగించుకుని, తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంచేశారు. అయితే ఈసారి ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం అన్ని శాఖల డిమాండ్లపై చర్చ జరిపించేందుకు చొరవ చూపించింది. దీనితో రెండుమూడు రోజుల పాటు అర్ధరాత్రి వరకు సభ నడిచింది. ఎంత ఆలస్యమైనా సంబంధిత శాఖల మంత్రులు పద్దులపై జరిగిన చర్చకు పూర్తి స్థాయిలో అన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు.