- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీపై హైకోర్టు సీరియస్.. కార్పొరేషన్ ఏం చేస్తున్నదంటూ ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక అంబర్‌పేట్‌లో రెండు రోజుల క్రితం వీధికుక్కల దాడిలో నాలుగేండ్ల చిన్నారి చనిపోయిన సంఘటనపై రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న హైకోర్టు సూమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కుకారాంజీ నేతత్వంలోని ధర్మాసనం గురువారం ఈ ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వాధికారులకు నోటీసులు జారీచేసింది. విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ ఏం చేస్తున్నదంటూ ఫైర్ అయింది. కార్పొరేషన్ అధికారులు అసలు పనిచేస్తున్నారా అని న్యాయవాదిని నిలదీసింది. కేవలం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే పసిబాలుడు చనిపోయాడంటూ అక్షింతలు వేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలకెటర్, తెలంగాణ లీగల్ అథారిటీ, అంబర్‌పేట్ మున్సిపాలిటీ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని సీజే బెంచ్ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోనున్నదీ వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. వీధికుక్కల దాడిలో పసిబాలుడు మరణించడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించిన హైకోర్టు సీజే బెంచ్ మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లింపు అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వారం రోజుల వ్యవధిలో హైకోర్టు సుమోటోగా తీసుకున్న కేసుల్లో ఇది రెండోది. గత వారం మెదక్ జిల్లాకు చెందిన ఖదీర్‌ఖాన్ పోలీసుల చిత్రహింసల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వచ్చిన వార్తలను సూమోటోగా తీసుకుని విచారించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఇప్పుడు వీధి కుక్కల దాడిలో పసిబాలుడు మరణించిన సంఘటనను కూడా సూమోటోగానే తీసుకుని విచారించింది. నాలుగు వారాల వ్యవధిలో కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్, అంబర్‌పేట్ మున్సిపల్ అధికారులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తదితరులకు గడువు ఇచ్చి తదుపరి విచారణను మార్చి నెల 16వ తేదీకి వాయిదా వేసింది.