Telangana Chief Minister : ప్రజా ప్రభుత్వం.. రేవంత్ CMగా కొలువుదీరిన కొత్త సర్కార్

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-07 08:11:59.0  )
Telangana Chief Minister : ప్రజా ప్రభుత్వం.. రేవంత్ CMగా కొలువుదీరిన కొత్త సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మంత్రులుగా మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్‌సింగ్ తదితరులంతా హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వం అనే పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడంతో ప్రజా పాలన మొదలైందనే మెసేజ్‌ను ప్రజల్లోకి కాంగ్రెస్ పంపింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితో తొలుత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆ తర్వాత వరుసగా పదకొండు మంది మంత్రులతో చేయించారు. ఇందులో మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు.

ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అని టైటిల్ పెట్టుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి నాలుగు ఉమ్మడి జిల్లాలు మినహా మిగిలిన ఆరు ఉమ్మడి జిల్లాలకు క్యాబినెట్‌లో స్థానం దక్కింది. నలుగురు అగ్రవర్ణాలకు చెందినవారుకాగా ఇద్దరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒకరు ఎస్టీ, ఒకరు బ్రాహ్మణ, ఒకరు కమ్మ, ఒకరు వెలమ సామాజికవర్గాలకు చెందినవారు. ఇందులో గతంలో మంత్రులుగా పనిచేసినవారితో పాటు ఫస్ట్ టైమ్ మంత్రులుగా అవకాశం దక్కినవారూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సైతం గతంలో మంత్రిగా పనిచేయకపోయినా ఈసారి నేరుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.

‘తెలంగాణ తల్లి’ సమక్షంలో..

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి అని సోనియాగాంధీని పలుమార్లు కీర్తించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆమె సమక్షంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ తల్లి రుణాన్ని తీర్చుకుంటాం.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిఫ్టుగా ఇస్తాం అని ఎన్నికల ప్రచారం సమయంలో బహిరంగంగానే చెప్పారు. ఆ కాన్ఫిడెన్సు ప్రకారమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు ఆమెకు గిప్టుగా ఇచ్చినట్లయింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలకు ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కాలి నడకనే ఎల్టీ స్టేడియంలో ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక మీదకు చేరుకున్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కర్ణాటక సీఎం

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించినా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీ సంఖ్యలో జనం హాజరు అవుతుండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ వాహనాల మధ్యలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇరుక్కుపోయారు. చివరకు కాలి బాటన వేదిక మీదకు చేరుకున్నారు. కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, మాజీ ఎంపీలకు, అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పంపినా విపక్షాలకు చెందిన పలువురు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని జిల్లాల లీడర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రస్థాయి నేతలు రావడంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు, ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

జాతీయగీతంతో ప్రారంభం :

కొత్త ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంతో ప్రారంభమైంది. రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి వేదిక మీదకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేరుకున్న వెంటనే జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌‌లో తొలుత రేవంత్‌రెడ్డి చేత ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

Next Story

Most Viewed