తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు!

by Gantepaka Srikanth |   ( Updated:30 Jan 2025 12:30 PM  )
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. బీసీ రిజ్వేషన్ల(BC Reservations) పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టును రెడీ చేశారు. ఈ తుది నివేదికను 2025, ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కుల గణన సర్వే రిపోర్టుపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి తుది నివేదికను ఆమోదం కోసం కేబినెట్‎కు పంపనుంది. 2025, ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయ్యి.. కులగణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలపనున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్చి రెండో వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా? అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులతో ఆరా తీసినట్టు తెలిసింది. వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు? రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్‌(Dedicated Commission)కు ఎన్ని రోజులు పడుతుంది? కమిషన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూలు ప్రకటించి, రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? అని అధికారులను వివరాలు అడిగినట్టు సమాచారం. బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం.. టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేలోపే ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించినట్టు తెలిసింది. కాగా, కులగణన రిపోర్టు సబ్ కమిటీకి అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఆ రిపోర్టును ఆమోదించనుంది. ఆ తరువాత బీసీ రిజర్వేషన్ ఫైనల్ చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ కసరత్తు ప్రారంభించనుంది.

రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాత ఎన్నికలను పూర్తి చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘గతంలో మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. షెడ్యూలు నుంచి, రిజల్ట్ వరకు ఆ సమయం సరిపోతుంది’ అని అధికారులు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ‘అయితే పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యేలోపు ఎన్నికలను పూర్తి చేయొచ్చా? అని సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు కంప్లీట్ చేయొచ్చని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ లోపు ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనా.. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.

Next Story