- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ANKAPUR CHICKEN: ట్రెండ్ సెట్టర్.. అంకాపూర్ చికెన్
తెలుగు రాష్ట్రాల్లో ఇష్టమైన వంటకాల్లో ఎప్పుడూ చికెన్ టాప్ 5లోనే ఉంటుంది. అలాంటి చికెన్ కర్రీని విలేజ్ స్టైల్‌లో వండితే ఇక దాని టేస్టే వేరు. ఆ పాయింట్ నే క్యాచ్ చేసి.. విలేజ్ స్టైల్ లో నాణ్యమైన దినుసులు ఉపయోగిస్తూ వండే కోడి కూరతో అంకాపూర్ ట్రెండ్ సృష్టించింది. వ్యవసాయంలో ప్రయోగాలు, విత్తన పంటలతో అంకాపూర్ అందరి నోళ్లలో నానగా.. ఇప్పుడు అదే ఊరిలో తయారవుతున్న కోడి కూరలు కూడా అందరిలో నోళ్లను ఊరిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో దొరికే నాటుకోడి కూరకున్న డిమాండ్ మరెక్కడా లేదంటే నమ్మాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోనే కాకుండా గల్ఫ్ దేశాలైన దుబాయి, మస్కట్, బెహరన్ వంటి ఎడారి దేశాలకు ఉపాధి కోసం ఇండియా నుంచి వెళ్లిన వారు కూడా అంకాపూర్ చికెన్ తినాలనిపిస్తే చాలు ఆర్డర్ ఇచ్చి మరీ పార్శిల్ తెప్పించుకుంటారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ఇక్కడినుంచి చికెన్‌ను ప్రత్యేకంగా పార్శిల్ చేయించుకుని తీసుకువెళ్తారని స్థానికులు గర్వంగా చెప్తున్నారు.
= ఆడెపు శ్రీనివాస్
రుచిలో బెస్ట్
అంకాపూర్‌లో అడుగు పెట్టగానే ముందుగా పొయ్యిమీద ఉడుకుతున్న చికెన్ సువాసనే రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. ఈ ఊరి చికెన్ ఇంతగా ఫేమస్ అవ్వడానికి చాలానే కారణాలున్నాయి. దాదాపు నలభై, యాభై ఏళ్లుగా ఈ ఊళ్లో నాటు కోడి కూర అంటే వెరీ స్పెషల్. నలభై, యాభై కుటుంబాలు దేశీ చికెన్‌ను వండివ్వడం, హోటళ్లను నడపడం వంటి వాటిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఒక్కో చికెన్ సెంటర్ ఈ వ్యాపారంపై కనీసం ప్రతినెలా రూ.లక్ష దాకా సంపాదిస్తున్నారు.
ఉపాధి అవకాశంగా దేశీ కోళ్ల పెంపకం..
అంకాపూర్ లో నాటు కోడి కూర అమ్మకాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడే దేశీ కోళ్ల పెంపకాన్ని ఉపాధి అవకాశంగా మలుచుకున్నారు. కరీంనగర్, వరంగల్ నుంచి నాటు కోళ్లను తెప్పించుకుని.. వాటిని పెంచుతున్నారు. అంతేతప్ప ప్రైవేటు ఫాములనుంచి నుంచి బ్రీడ్ ను తీసుకుని పెంచేందుకు ఇక్కడి వ్యాపారులు ఇష్టపడరు. ఇదికూడా ఇక్కడి చికెన్ కు ఇంతటి పేరు రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం గ్రామంలోనే దాదాపు ఓ ఇరవై మంది వరకు కోళ్ల పెంపకం చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి 200 నుంచి 300 కోళ్లను పెంచుతున్నారు. వాటికి సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి సహజంగా పండించిన ధాన్యాన్ని దాణాగా వేసి పెంచుతున్నారు. వీటితో పాటు అట్టి జిమ్మలు (ఎండు చేపలు)తో తయారు చేసిన దాణాను కూడా వీటికి పెడుతున్నారు. అందుకే మన ఇళ్లలో పెంచుకునే కోళ్లకు, ఇక్కడ పెంచే కోళ్లకు క్వాలిటీలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
అంకాపూర్ చికెన్‌కు స్పెషల్ క్రేజ్!
ఏళ్లుగా అంకాపూర్ చికెన్ క్రేజ్ నేటికీ ఎక్కడా తగ్గడం లేదు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులను ఇక్కడికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తే.. ముందుగా వారు కోరే కోరిక అంకాపూర్ చికెన్. నిజానికి ఇది సరదాగానే అన్నా అంకాపూర్ చికెన్ పేరు అంతగా ఫేమస్ అయిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అంకాపూర్ చికెన్ మెస్ వ్యాపారం చూస్తే చాలా చిన్నగానే కనిపిస్తుంది. ఎలాంటి హంగూ, ఆర్భాటాలు ఉండవు. కానీ, వ్యాపారం మాత్రం జోరుగా సాగుతుంటుంది.ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంపాదనకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం. అంకాపూర్ చికెన్ వ్యాపారులు నిజామాబాద్, హైదరాబాద్ లో సెటిలయ్యి.. అక్కడ కూడా అంకాపూర్ స్పెషల్ చికెన్ పేరిట వ్యాపారాన్ని విస్తరించుకోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చే ఏ అధికారి అయినా, రాజకీయ నేత అయినా తప్పకుండా లంచ్‌లో అంకాపూర్ చికెన్ ఉండేలా చూసుకుంటారు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల ఆంతరంగిక సమావేశాలకు భోజనాల్లో అంకాపూర్ చికెన్ ను ప్రిఫర్ చేస్తున్నారంటే దీని రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ కిలోల లెక్కన ఉండదు.. ఒక్క కోడి లెక్క
అంకాపూర్ చికెన్ (నాటు కోడి కూర) ను కిలోల లెక్కన ఇవ్వరు. ఒక్క కోడి లెక్కన వండి అమ్ముతారు. ఒక్క పూర్తికోడి నుంచి సాధారణంగా 750 గ్రాముల వరకు చికెన్ వస్తుంది. ముగ్గురు వ్యక్తులు తినేంతగా అన్నంతో పాటు ఇచ్చే చికెన్‌కు రూ.850 తీసుకుంటారు. అన్నం వద్దనుకుంటే రూ.750 చార్జీ చేస్తారు. గ్రామంలో దాదాపు 30 నుంచి 40 వరకు దేశీ నాటుకోడి కూర వండి ఇచ్చే సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్ దగ్గరా గిరాకీ బాగానే ఉంటుంది. అంకాపూర్‌లో చికెన్ వ్యాపారం ప్రతిరోజు సగటున రూ. 4 లక్షల వరకు అవుతున్నట్లు అంచనా. ఆదివారాల్లో ఇది దాదాపు డబుల్ అవుతుందని అంచనా. బయటి మార్కెట్లతో పోల్చితే అంకాపూర్‌లో చికెన్ ధర ఎక్కువగానే ఉంటుంది.. కానీ, రుచి, దీనికున్న క్రేజ్‌ను బట్టి ఈజీగా డబ్బులకు వెనుకాడరు.
దీన్ని ఎలా తయారు చేస్తారు?
అంకాపూర్ చికెన్ తయారీ విధానం చూస్తే.. ఇందులో రహస్య దినుసులు ఏవీ వాడరు. అయితే, పూర్తిగా ఆర్గానిక్ పంటలతో వచ్చిన దినుసులు వాడటమే ఇక్కడి స్పెషల్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, మిరియాలు, ధనియాల, గసగసాలు, పసుపు, తదితర మసాలా దినుసులన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వాడతారు. షాపుల్లో రెడీమేడ్ గా దొరికే ఏ ఒక్క దినుసు ఇక్కడ వాడరు. వండేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. వీటి వల్ల అంకాపూర్ చికెన్ రుచికి.. మనం ఇంట్లో వండుకునే చికెన్ రుచికీ చాలా తేడా ఉంటుంది. అంకాపూర్ చికెన్ ముక్క నోట్లో వేసుకుంటే వెంటనే నమిలి మింగేయాలనేంత ఆరాటంగా ఉంటుందని చికెన్ ప్రియులంటారు. చికెన్ గతంలో చాలా తక్కువగా ఉండేదని, ఈ మధ్య కాలంలో రేటు బాగా పెంచేశారని, అయినప్పటికీ తగ్గేదేలే.. అంటూ అంకాపూర్ చికెన్ ను ఇష్టంగా ఆరగిస్తున్నారని చెపుతున్నారు.
మీలో ఎవరు కోటీశ్వరుడులో ప్రశ్న
గతంలో మాటీవీలో సినీ నటుడు నాగార్జున హోస్ట్‌గా నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షోలో అంకాపూర్ చికెన్‌పై ప్రశ్నించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకే పరిచితమైన ఈ స్పెషల్ వంటకం క్రేజ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు చికెన్ ప్రియులు ఇప్పటికీ అంకాపూర్ చికెన్ ను ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్లను బతిమాలి వారిచేత పార్శిల్ తెప్పించుకుంటారు. అంకాపూర్ చికెన్ పేరుతో నిజామాబాద్, ఆర్మూర్ తదితర పట్టణ ప్రాంతాల్లోనూ నాటు కోడి కూర అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అంకాపూర్ చికెన్ ఓ ట్రెండ్ ను సెట్ చేసిందనే చెప్పొచ్చు.
కోళ్లలో రకాలు..
అంకాపూర్ మూడు రకాల కోళ్లను కూరలకు వినియోగిస్తుంటారు. ఇక్కడ సోనాలి, అసూల్, ప్యూర్ రకం కోళ్లను పెంచుతున్నారు. ఇవికాకుండా కడక్ నాథ్ కోళ్ల సాగు కూడా ఉంటుందని ఇక్కడి వ్యాపారులు చెపుతున్నారు. ఈ రకం కోడి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కిలో రూ. 800 ల నుంచి రూ.1000 వరకు ఉంటుంది.
ఆర్టీసీ కార్గో..
అంకాపూర్ చికెన్ రాష్ట్రవ్యాప్తంగా సప్లయ్ చేస్తామని 2020లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అన్నట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ ప్రియులు భారీగా ఆర్డర్లు కూడా పెట్టారు. ఆర్టీసీ కార్గో సర్వీస్‌తో చికెన్.. ఫిష్, మక్కగారెలు, మక్క కంకులు సప్లయ్ చేశారు. అయితే, ప్యాకింగ్ సమస్యల కారణంగా ఆర్టీసీకి ఫిర్యాదులు పెరగడంతో గత ఆరు నెలలుగా ఆ సర్వీసు రద్దు చేశారు. అయితే, వరంగల్, నర్సంపేట, ఆదిలాబాద్ వైపు నుంచి నిజామాబాద్ కు ప్రతిరోజూ నడిచే ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు భలే డిమాండ్. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు అంకాపూర్ చికెన్ కోసం వారిని బతిమాలి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్లర్లచే తెప్పించుకుని ఇష్టంగా తినే అంకాపూర్ చికెన్ ప్రియులున్నారంటే ఆశ్యర్యం కలగకమానదు. ప్రతిరోజు అంకాపూర్ చికెన్ కోసం అంకాపూర్ షాపుల ముందు ఆగే ఆర్టీసీ బస్‍లు కనిపంచడం షరామామూలే.
30 ఏళ్లుగా నాకు ఇదే ఉపాధి..
అంకాపూర్‌లో 30 ఏళ్ల కిందట మా నాన్న చికెన్ వ్యాపారం మొదలుపెట్టారు. నేను నా భార్య ఇద్దరం కలిసి దీన్ని కొనసాగిస్తున్నాం. మా తమ్ముడు కూడా ఇదే వ్యాపారంలో ఉన్నాడు. మాకు వ్యవసాయం లేదు. పూర్తిగా దీని మీదే ఆధారపడ్డాం. ఈ వ్యాపారం కూడా బాగానే సాగుతున్నది. అంకాపూర్ చికెన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణే మాకు పెట్టుబడి. కస్టమర్లకు వారికి నచ్చిన విధంగా రుచికరమైన చికెన్ ను వండి ఇస్తుండటంతో ఇన్నేళ్లుగా మేం మార్కెట్లో మంచి పొజిషన్‌లో ఉన్నాం. అంకాపూర్‌లో దాదాపు 40కి పైగా చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ పార్శిల్ తీసుకుపోయే వారే ఎక్కువగా వస్తారు.
ప్రవీణ్ గౌడ్, చికెన్ వ్యాపారి (అంకాపూర్)
కోళ్ల పెంపకం బాగుంది..
నాలుగైదేళ్లుగా కోళ్ల పెంపకం చేపడుతున్నాం. మాకు వ్యవసాయం ఉంది. సైడ్ బిజినెస్‌గా మొదలు పెట్టాం. దీన్ని చూసుకోడానికి ఓ వ్యక్తిని నియమించాం. ఆయనే ఈ కోళ్ల పెంపకాన్ని చూసుకుంటాడు. మార్కెటింగ్ విషయాలు మేం చూసుకుంటాం. అంకాపూర్ చికెన్‌కు ఉన్న డిమాండ్ మా వ్యాపారానికి బాగా ఉపయోగపడుతున్నది. ఆదాయం కూడా బాగానే ఉంది. దేశీ కోళ్లకు ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి.. పైగా పెంపకంలో కూడా ఎక్కువగా ఇబ్బందులు లేకపోవడం మాకు కలిసి వస్తున్నది.
కాచర్ల హరీష్ , కోళ్ల పెంపకందారు (అంకాపూర్)
ఇక్కడి రుచి ఎక్కడా దొరకదు..
స్వతహాగా నేను భోజన ప్రియుడిని. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అందులో చికెన్ అంటే మరీ మరీ ఇష్టం. నేను ఎక్కడకు వెళ్లినా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను. ఎన్నో చోట్ల చికెన్ తిన్నాను. కానీ, అంకాపూర్ చికెన్ అంతటి రుచి ఎక్కడా దొరకలేదు. అందుకే నెలలో కనీసం రెండు, మూడు సార్లయినా ఇక్కడికి వచ్చి తింటా.. దీన్ని మించిన రుచి ఎక్కడా దొరకదని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
మునిగల్ల నాగరాజు, నిజామాబాద్