టార్గెట్ జగిత్యాల.. ఎంపీ అర్వింద్ భారీ స్కెచ్!

by Sathputhe Rajesh |
టార్గెట్ జగిత్యాల.. ఎంపీ అర్వింద్ భారీ స్కెచ్!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : బీజేపీ అధిష్టానం జగిత్యాల జిల్లాపై గురి పెట్టిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతును ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగురవేసేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలు పెట్టిన బీజేపీ నాయకులు అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆదరణ దక్కని నాయకులే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు.

టికెట్ల విషయం అటు ఉంచితే ప్రజా గోస బీజేపీ భరోసా పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహిస్తూ జిల్లాలోని ప్రముఖ బీజేపీ నాయకులను ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా అధినాయకత్వం చర్యలు చేపట్టింది. అధికార బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే లక్ష్యంగా కార్నర్ మీటింగుల్లో బీజేపీ నాయకులు దాడి చేస్తూ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలలో బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాల్సి ఉంది.

ఆసక్తిగా మారిన బండి పర్యటన...

బండి సంజయ్ జగిత్యాల పర్యటన ఆసక్తిగా మారింది. కొడిమ్యాల మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సంజయ్ అక్కడనుంచి నేరుగా జగిత్యాలకు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అయిన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ భోగ శ్రావణి ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశిస్తూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

బీఆర్ఎస్‌లో ఉన్న మహిళకు అన్యాయం జరిగితే కనీసం స్పందించని నువ్వు ఢిల్లీలో మహిళల కోసం దీక్షలు చేస్తావా అంటూ విమర్శించారు. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితులు ఉండవని తేల్చిచెప్పారు. టికెట్ల విషయంలో అధిష్టానానిదే ఫైనల్ డెసిషన్ అని సంజయ్ తెలిపినప్పటికీ బీజేపీలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం ఒక ఎత్తయితే బీజేపీ ముఖ్య నాయకులైన ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇదివరకే భోగ శ్రావణి ఇంటికి వచ్చి మద్దతు ప్రకటించడంతో వచ్చే ఎన్నికలలో జగిత్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రావణిని బరిలో ఉంచితే కలిసి వస్తుందన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

జగిత్యాలపై ధర్మపురి అర్వింద్ నజర్...

జగిత్యాల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసేందుకు ధర్మపురి అర్వింద్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లలో జగిత్యాల సీటు గెలిపించుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నించి సఫలీకృతమయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికలలో మాత్రం కవితపై అర్వింద్ పైచేయి సాధించారు. ఈసారి మాత్రం ఎలా అయినా జగిత్యాల సీటు గెలుపొందేందుకు అర్వింద్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

అందులో భాగంగానే ప్రజాదరణ ఉన్న కొందరు ముఖ్య నేతలను బీజేపీలోకి తీసుకువచ్చారు. భోగ శ్రావణిని సైతం బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఎంపీ అర్వింద్ కీ రోల్ పోషించినట్లు తెలుస్తుంది. మరికొందరు అసంతృప్త బీఆర్ఎస్ నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ఏదేమైనా ఓవైపు బీజేపీలోకి వలసలు రావడం మరోవైపు రాష్ట్రస్థాయి బీజేపీ నాయకులు జగిత్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story