- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Survey: గ్రామాల్లో సర్వే కోలాహలం.. సంక్షేమ పథకాలపై నిరుపేదల ఆసక్తి

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సర్వే సందడి చేస్తోంది. మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సన్నహాలు చేయడంతో గ్రామాల్లో ఫీల్డ్ సర్వే దూసుకుపోతుంది.ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆ సర్కార్.. తాజాగా మరో 4 పథకాలను తెర మీదకు తెచ్చింది. త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ అత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అందుకు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఫీల్డ్ సర్వే చేపడుతోంది. పథకాలకు మీరు ఎంపికయ్యారా? అంటే మీరు ఎంపికయ్యారా? అన్న అంశం తెలంగాణ అంతటా ఇప్పుడు రచ్చ చేస్తోంది. మరికొందరు పథకాలు కోసం పైరవీలు ప్రారంభించినట్టు మరో ప్రచారం ఊపందుకుంటుంది. అధికారులకు అందుబాటులో ఉండకపోతే పథకాలు రావన్న ఉద్దేశంతో చాలామంది పనికెళ్లకుండా.. సొంత ఊర్లోనే తిష్ఠవేస్తున్నారు. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు దగ్గర ఉంచుకొని అధికారుల కోసం మరికొందరు ఎదురు చూసి.. వివరాలు అందజేస్తున్నారు. నాలుగు పథకాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వడపోత ఎలా చేపట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అర్హుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని మరోపక్క ఆదేశాలు జారీ కావడంతో మండల, గ్రామ స్ధాయి అధికారులు మెరుగైన ముసాయిదాలను రూపొందించడానికి తంటాలు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘించలేక.. పైరవీలను సమర్థించలేక మరికొందరు అధికారులు నలిగిపోతున్నారు.
21 నుంచి గ్రామ సభలు
నాలుగు పథకాలకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఈనెల 20లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఫీల్డ్ సర్వే పూర్తయిన తరువాత.. లబ్ధిదారులు ముసాయిదా జాబితాను రూపొందిస్తారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీవరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. జిల్లా ఇంచార్జి మంత్రులతో లబ్ధిదారుల జాబితాకు ఆమోదం లభించన తరువాత నిధులు-మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఈనెల 26 నాటికి అంటే రిపబ్లిక్ డే నాటికి ఆ నాలుగు పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించడానికి చురుకైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
క్షేత్ర స్థాయిలో తనిఖీలు
పథకాలు పకడ్బందీగా అమలు చేయడం కోసం అధికారులు మరికొన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు ఇప్పటికే అందజేశారు. సాగుయోగ్యం కానిభూములను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. గ్రామసభల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలను చదవి వినిపిస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి, ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి..భూమిలేని వ్యవసాయ కూలీల వివరాలను సేకరిస్తారు.
రేషన్ కార్డుల జారీ కోసం..
రేషన్ కార్డుల జారీ కోసం కుటుం సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తరువాత ముసాయిదా జాబితాను రూపొందించి గ్రామసభల్లో ఆమోదింపజేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ఇదే తరహాలోనే అమలు చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు స్థాయిలో ప్రదర్శించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక, డాటా ఎంట్రీ, క్షేత్ర స్థాయి పరిశీలన వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. డేటా ఎంట్రీ ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.