వైఎస్ వివేకా మర్డర్‌.. CM జగన్‌పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-01 10:33:12.0  )
వైఎస్ వివేకా మర్డర్‌.. CM జగన్‌పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకా మర్డర్ కుట్రపై సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి 2019 మార్చి 14-15 రాత్రి హత్యకు గురయ్యారని తెలిపారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలన్నారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితేనే తనకు న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన నాన్న ఓటమి పాలయ్యారని.. సొంత వాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నా అన్నారు. ఓటమి పాలైన తన తండ్రిని మరింత అణచాలని చూశారన్నారు. హత్య తర్వాత మార్చురీ వద్ద అవినాష్ తనతో మాట్లాడారని.. పెదనాన్న రాత్రి 11.30 గంటల వరకు నా కోసం ప్రచారం చేశారని చెప్పారని గుర్తు చేశారు. అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదన్నారు.

ఒక్కో సారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు. సీబీఐ ఎంక్వైరీకి వెళ్దామని జగన్ ను అడిగానని.. సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారని అన్నారని తెలిపారు. ఈ కేసులో అరెస్ట్, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టిందన్నారు. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. సీబీఐపైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారని తెలిపారు. కేసు దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టి భయపెట్టారని సునీతా వాపోయారు.

ముందుగా సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని క్వశ్చన్ చేశారు. కర్నూలులో అవినాష్‌ను అరెస్ట్ చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారని స్పష్టం చేశారు. శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత మొత్తం కేసు మారిపోయిందన్నారు. శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత భయం మొదలైందన్నారు. అప్పటి నుంచే సీబీఐపై కేసులు పెట్టడం ప్రారంభించారన్నారు.

విలువలు, విశ్వసనీయత, మాట తప్పను.. మడమ తిప్పను అని సీఎం జగన్ పదేపదే అంటుంటారన్ని.. నాన్న వివేకా హత్య కేసులో ఇలాంటివి ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. మంచి, చెడుకు, పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారు.. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. సీబీఐ విచారణలో నిందితులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని.. ఖచ్చితంగా వాళ్లను జగన్ రక్షిస్తున్నారన్నారు.

జగన్ పాత్ర ఉందా లేదా అనేది తాను చెప్పకూడదని.. కానీ సీబీఐ విచారణ జరపాలన్నారు. జగన్ పార్టీ వైసీపీకి ప్రజలు ఓటు వేయవద్దని రిక్వెస్ట్ చేశారు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దన్నారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ ప్రారంభమైందన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. సీబీఐ అరెస్ట్ చేయడానికి వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూశామా అన్నారు. నిందితులను పట్టుకోవడంలో ఇంత జాప్యం ఏ కేసులో లేదన్నారు.

Read More : అందుకే వారితో యుద్ధం చేయాల్సి వస్తోంది.. CM జగన్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed