- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అసెంబ్లీ సమావేశాల వేళ.. ఎమ్మెల్యేలకు స్పీకర్ కీలక సూచన

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలోలాగే ఈ సమావేశాలకూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని, సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. శాఖలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. సోమవారం శాసనసభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. రేపటి నుండి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని.. బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పారు. సభలో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించిన సరైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. సభకు సమర్పించే సమాధాన పత్రాలను ముందుగానే పంపితే వాటిని సభ్యులు చదువుకొని సభలో మాట్లాడడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించి ఇవ్వాలన్నారు. సమావేశాలు సజావుగా జరగడానికి పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే కట్టడి చేయాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా, చురుకుగా పనిచేయాలని పేర్కొన్నారు.
సభ్యులు సమయానికి శాసనసభకు చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసన సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. సమావేశాలు జరిగే రోజుల్లో అసెంబ్లీ, శాసనమండలి చుట్టూ మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు జవాబులను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, జీఏడీ సెక్రెటరీ రఘనందన్ రావు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా, డీజీపీ డాక్టర్ జితేందర్, ఏడీజీ, లా అండ్ ఆర్డర్ మహేశ్ భగవత్, డీజీ ఫైర్ నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు సీవీ అనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహంతి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి పాల్గొన్నారు.