Smita Sabharwal : స్మితా సబర్వాల్‌కు MLA రఘునందన్ రావు కౌంటర్

by GSrikanth |   ( Updated:2023-07-24 12:03:31.0  )
Smita Sabharwal : స్మితా సబర్వాల్‌కు MLA రఘునందన్ రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల వివిధ అంశాలపై సోషల్ మీడియాలో ఆమె తరచు చేస్తున్న పోస్టులు ఇంటర్నెట్‌లో చర్చగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మణిపూర్ ఘటనపై రియాక్ట్ అయిన స్మితా సబర్వాల్‌కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన అంశంలో స్మితా సబర్వాల్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్వీట్లు పెడతారు. ఇప్పుడు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేశారు.

రఘునందన్ రావుతో పాటు పలువురు నెటిజన్లు సైతం ఈ అంశాంపై స్మితా సబర్వాల్ రియాక్షన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార తీరు ఫక్తు రాజకీయ నాయకురాలిగా ఉందని ఇప్పటికే పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న వేళ నల్గొండ ఘటనపై స్మితా ఎందుకు స్పందించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై రియాక్ట్ కావడానికి క్షణం ఆలస్యం చేయని ఈ ఆఫీసర్.. తెలంగాణలో జరుగుతున్న దురాగతాలపై మాత్రం నోరుమెదపడంలేదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై ఆమె చేసిన పోస్టులను ప్రస్తావిస్తూ.. అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఇంత సెలెక్టివ్ గా ఆలోచించడం ఏంటి.. పెయిడ్ ప్రమోషన్స్ మాదిరిగా సెలెక్టివ్ అంశాల మీదనే రియాక్ట్ అవుతారా తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనబడటం లేదా లేక సమయం లేక స్పందించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. మరి తాజా విమర్శలపై స్మితా సబర్వాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed