టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు సిట్​ నోటీసులు

by Javid Pasha |
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు సిట్​ నోటీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ కేసులో సిట్ ​అధికారులు శుక్రవారం బోర్డు చైర్మన్, సభ్యులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఈ కేసులో విచారణ చేపట్టాల్సిందిగా ఈడీకి ఫిర్యాదు చేశారు. బషీర్​బాగ్​లోని ఈడీ కార్యాలయానికి స్వయంగా వెళ్లి దీనిని అధికారులకు అందచేశారు. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి కలిసి టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి పదిహేను పరీక్షల పత్రాలను తస్కరించినట్టు సిట్​అధికారులు తేల్చారు. అయితే, దీంట్లో గ్రూప్​1 ప్రిలిమ్స్, ఏఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు మాత్రమే బయటకు వెళ్లినట్టు నిర్ధారించారు.

నోటీసులు జారీ...

సస్పెన్స్​క్రైం థ్రిల్లర్​సినిమాను తలపిస్తూ కొనసాగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో రోజుకో ట్విస్ట్​వెలుగు చూస్తోంది. తాజాగా సిట్​ అధికారులు బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు సభ్యులు రమావత్ ​ధన్​సింగ్, ప్రొఫెసర్ ​బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్, రవీందర్​రెడ్డి, ఆర్.సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని సూచించింది. బోర్డులో ఈ సభ్యుల బాధ్యతలు ఏమిటి? ప్రశ్నాపత్రాలను రూపొందించటంలో వీరి పాత్ర ఏ మేరకు ఉంటుంది? కార్యాలయంలోని కంప్యూటర్ల యాక్సెస్​వీరికి ఉంటుందా? అన్నదాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి సిట్​అధికారులు వీరి నుంచి వివరాలు సేకరించనున్నారు. అయితే, బోర్డు కార్యాలయానికి వెళ్లి వీరిని ప్రశ్నిస్తారా? లేక సిట్​కార్యాలయానికి పిలిపిస్తారా? అన్నది స్పష్టం కాలేదు.

ఈడీకి ఫిర్యాదు చేసిన రేవంత్...

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు జరపాల్సిందిగా రేవంత్​రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈడీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఒక దేవాలయంలా ఉన్న టీఎస్పీఎస్సీని కేసీఆర్​ప్రభుత్వం దొంగలు, అవినీతిపరులకు కేంద్రంగా మార్చిందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరి తీసినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమంలో 17వందల మంది ప్రాణాలను త్యాగం చేస్తే రాష్ర్టం వచ్చాక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెండువేల మంది చనిపోయారన్నారు. మానవ రూపంలో ఉన్న మృగాలు రాష్ర్టాన్ని ఏలుతున్నాయని దుయ్యబట్టారు. ఎనిమిదేళ్ల తరువాత నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్​చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. కాన్ఫిడెన్షియల్​రూంలోకి వెళ్లటానికి కఠినమైన నిబంధనలు ఉంటాయని చెబుతూ నిందితులు లోపలికి ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు. దీనినిబట్టే ఇందులో మరికొందరి పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోందని చెప్పారు. బోర్డు ఉద్యోగిని అయిన శంకర్​లక్ష్మి నుంచే తప్పు జరిగిందన్నారు. బోర్డు ఛైర్మన్, కార్యదర్శిలను కేసులో ఏ1, ఏ2 నిందితులుగా చేర్చాలన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చి గ్రూప్​1 ప్రిలిమ్స్​పరీక్ష రాసినట్టు వెల్లడవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారి ఉంటాయన్నారు.

అందుకే ఈ కేసు దర్యాప్తును చేపట్టాలని సిట్​కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఇంతకు ముందే కేసువిచారణను సీబీఐకి అప్పగించాలని ఇంతకు ముందే డిమాండ్​చేసినట్టు రేవంత్​రెడ్డి చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్​ తరఫున హైకోర్టులో పిటీషన్​దాఖలు చేశామని, అది విచారణలో ఉందని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించిన వివరాలు కేటీఆర్​కు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. సిట్​అధికారులు చెబుతున్నారా? లీకేజీలో పాత్ర ఉన్నవారు చెబుతున్నారా? అని అన్నారు. నిజంగా కేటీఆర్​కు పరువు ఉంటే కేసు విచారణను సీబీఐ లేదా ఈడీకి అప్పగించాలన్నారు. తన పరువు వంద కోట్లు అని కేటీఆర్​ ఎలా నిర్ణయించుకున్నారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్​పట్టించుకోవటం లేదని, పార్టీ బలోపేతంపైనే ఆయన దృష్టి కేంద్రీకృతమై ఉందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న వారిని నోటీసుల పేర అణచివేయాలని చూస్తున్నారన్నారు.

కొనసాగుతున్న దర్యాప్తు...

మరోవైపు సిట్​అధికారులు ఈ కేసులో విచారణను వేగంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి కలిసి బోర్డకు సంబంధించిన వేర్వేరు పరీక్షలకు సంబంధించి పదిహేను ప్రశ్నాపత్రాలను చౌర్యం చేసినట్టు గుర్తించారు. అయితే, వీటిలో రెండు మాత్రమే బయటకు వెళ్లాయని సిట్​అధికారులు చెబుతున్నారు. ఏఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​ప్రశ్నాపత్రాలను నిందితులు బయటి వ్యక్తులకు అమ్మినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఇక, గ్రూప్​1 ప్రిలిమ్స్​ప్రశ్నాపత్రం బయటకు లీక్​ కాలేదని చెప్పారు. బోర్డు ఉద్యోగులైన ప్రవీణ్, షమీమ్, రమేష్, మాజీ ఉద్యోగి సురేష్, న్యూజీలాండ్​లో ఉంటున్న రాజశేఖర్​రెడ్డి బావ ప్రశాంత్​రెడ్డి మాత్రమే ఈ పరీక్ష రాసినట్టుగా తేలిందని వివరించారు.

నేరుగా కోర్టుకే సమర్పిస్తాం...

మంత్రి కేటీఆర్​కు సిట్​అధికారులు దర్యాప్తు వివరాలను అంద చేస్తున్నారా? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిట్​అధికారులు స్పందించారు. తాము ఎవ్వరికీ ఎలాంటి వివరాలు అంద చేయలేదని చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసులో వందమందిని విచారించినట్టు తెలిపారు. దర్యాప్తు పూర్తి కాగానే అన్న వివరాలతో నివేదికను రూపొందించి నేరుగా కోర్టుకే సమర్పిస్తామని తెలిపారు.

Advertisement

Next Story