ROR Act-2024: ఆర్వోఆర్ యాక్ట్ - 2024 ముసాయిదా.. వివాదాలకు చెక్!

by Shiva |   ( Updated:2024-08-13 03:18:06.0  )
ROR Act-2024: ఆర్వోఆర్ యాక్ట్ - 2024 ముసాయిదా.. వివాదాలకు చెక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఏ గ్రామంలో అయినా రెవెన్యూ రికార్డులు, సేల్​డీడ్స్, మ్యుటేషన్ ఉత్తర్వులకు వాస్తవ భూ విస్తీర్ణానికి సరిపోతుందా..? నిజంగా అలాంటి రెవెన్యూ గ్రామం తెలంగాణలో ఉంటే 100 శాతం వివాదాల్లేనిదిగా రికార్డుల్లో నమోదు చేయొచ్చు. ఏదైనా సర్వే నంబరు 100 ఎకరాల విస్తీర్ణం ఉంటే క్రయ విక్రయాలు 120 ఎకరాలకు పైగా చేశారు. కచ్చితంగా అంతే విస్తీర్ణంపైనే లావాదేవీలు జరిగిన గ్రామాల సంఖ్య శూన్యం. పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగానే సేల్​డీడ్​లేదా గిఫ్ట్​డీడ్​/ఏజీపీఏ. అందులోని కొంత విస్తీర్ణాన్ని విక్రయించగానే ఆ మేరకు తొలగించ లేదు.

దీంతో అదే విస్తీర్ణాన్ని మరొకరికి విక్రయించిన ఉదంతాలు ఎన్నెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఎకరం రూ.కోట్లు పలుకుతున్న ప్రాంతాల్లోనే ఇలాంటి అవినీతి దందా వరదలా ప్రవహించింది. సేల్‌డీడ్​పొందడం, మ్యుటేషన్ చేయించుకొని పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించుకోవడం పరిపాటిగా మారింది. కానీ క్షేత్ర స్థాయిలో నిజంగా ఎంత భూమి ఉన్నదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సబ్​రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు సేల్‌డీడ్, మ్యుటేషన్లు చేశారు. సాగు భూమిగానే కాకుండా దాన్నే ప్లాట్లుగానూ రిజిస్ట్రేషన్లు చేసిన ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటికీ ప్లాట్లుగా మారిన భూములు ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములుగా కొనసాగుతున్నాయి.

ఆఖరికి రైతుబంధు సొమ్మును కూడా తెగ తింటున్న పెద్దోళ్లు ఉన్నారు. అవి ఏనాడో లేఅవుట్లుగా చేసి అమ్మేశారని.. ఇవిగో సేల్‌డీడ్లు అంటూ ఆధారాలు చూపించినా వారికే మద్దతు పలుకుతున్న తహశీల్దార్లు, కలెక్టర్లు కూడా దర్శనమిస్తున్నారు. రికార్డుల్లో నుంచి తొలగించకుండా, జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయకుండా చోద్యం చూస్తున్నారు. ఇప్పుడా కథలకు చెక్ పడనున్నది. భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్. ఆ భూమికి హద్దులు, కొలతలతో కూడిన సర్వే సబ్ డివిజన్ మ్యాప్ ఉంటేనే సేల్‌డీడ్/మ్యుటేషన్. ఇదే ఆర్వోఆర్ యాక్ట్ 2024 ముసాయిదాలో ఉంది. కర్నాటకలో కావేరి పేరిట చేపట్టిన ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్‌కి ముందే సర్వే, సబ్ డివిజన్ మ్యాప్స్ విధానం సక్సెస్ అయ్యింది. అందుకే దాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు ముసాయిదాలో పేర్కొన్నారు.

అక్రమార్కులకు చెక్..

ధరణి పోర్టల్​అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సేత్వార్ (రీసెటిల్మెంట్​ఆఫ్​సర్వే రికార్డ్) తేడా ఉండడం కూడా కొందరు రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తున్నది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మెదక్​, వికారాబాద్​జిల్లాల్లో రికార్డుల్లోని భూమి కంటే ఎక్కువగా అమ్మినట్లు తెలుస్తున్నది. ఈ నాలుగైదు జిల్లాల్లోనే లక్ష డాక్యుమెంట్ల వరకు ఉండొచ్చునని అంచనా. అంటే విక్రయించిన భూమినే చూపి మళ్లీ అమ్మేసిన విస్తీర్ణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. ఐతే కొన్ని మండలాల్లో ముందు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించకుండా.. తరువాత కొనుగోలు చేసిన వారికే పాసు పుస్తకాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఆర్వోఆర్ 2024 అమల్లోకి రావాల్సిందేనని నిపుణులు అంటున్నారు. ప్రతి కొనుగోలును గుడ్డిగా చేయకుండా చెక్ పెట్టే మెకానిజం తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ప్రతి ఊరిలో అసలు విస్తీర్ణం కంటే పెరిగిన 20 నుంచి 25 శాతం భూముల అమ్మకాలను నియంత్రించే వెసులుబాటు కలుగుతుంది.

ఎప్పుడెప్పుడు సర్వే మ్యాపులు

  • సెక్షన్ 3(3) ప్రకారం భూమి అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి, పంపకాలు, రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ చేసేటప్పుడు విక్రేత సమర్పించాలి.
  • సెక్షన్7(1) ప్రకారం వీలునామా, వారసత్వ మ్యుటేషన్లు.
  • సెక్షన్ 8(1) ప్రకారం వివిధ పద్ధతుల ద్వారా భూమి హక్కులు పొందినప్పుడు మ్యుటేషన్ పొందడానికి సర్వే సబ్ డివిజన్ మ్యాపులను ఆర్డీవోకు సమర్పించాలి.

ఉపయోగాలు ఇలా..

  • ఇక నుంచి గెట్టు పంచాయతీలు తలెత్తవు.
  • డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడుతుంది.
  • సర్వే నంబరు ఒక చోట, భూమి మరో చోట ఉండే పరిస్థితి దాపురించదు.
  • సర్వే నంబరులోని విస్తీర్ణం తక్కువ/ఎక్కువ సమస్య తలెత్తదు.
  • ఫిజికల్ పొషిషన్ లేకుండా అమ్మకాలు కుదరవు. రికార్డుల్లోనే ఉండే భూముల అమ్మకాలు చెల్లవు.
  • షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ(హద్దులు) సేల్‌డీడ్‌తో పాటు మ్యాప్‌లోనూ స్పష్టంగా ఉంటాయి. దాంతో పంచాయతీలకు చాన్స్ ఉండదు.

సమస్య.. పరిష్కారం

తెలంగాణలో ఏ ఊరిలోనూ సర్వే నంబర్ల ప్రకారమే రైతుల పొషిషన్ లేదు. రికార్డుల్లో పేర్కొన్న సర్వే నంబర్ల ప్రకారం సాగు చేసుకుంటున్న వారి సంఖ్య 60 శాతమే. మిగతా 40 శాతం వారికి సంక్రమించిన విస్తీర్ణం మేరకు కబ్జాలో ఉన్నప్పటికీ సర్వే నంబర్ల ప్రకారం పొషిషన్‌లో లేరు. వీటినే వైవాట్ ఖాతాలుగా పిలుస్తున్నారు. ఈ భూములను అమ్మేటప్పుడు సర్వే, సబ్ డివిజన్ మ్యాప్స్ సమర్పించడం సమస్యగా మారొచ్చు. విలేజ్ మ్యాప్‌లో చూపించినట్లుగా అదే సర్వే నంబరులోని విస్తీర్ణంతో కూడిన మ్యాప్‌ను అందించడం అసాధ్యం. అలాంటప్పుడు పొషిషన్ తో కూడిన హద్దులు, విస్తీర్ణం పేర్కొంటూ సర్వే మ్యాప్‌ను జత చేయొచ్చునని, సబ్జెక్ట్ టూ ఫిజికల్ పొషిషన్‌గా నిర్ధారించి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ఆలోచిస్తామని ధరణి కమిటీ సభ్యుడు, చట్టం తయారీలో కీలక భూమిక పోషించిన ఎం.సునీల్ కుమార్ ‘దిశ’కు వివరించారు. ఎలాగూ భూదార్ టెంపరరీ, పెర్మినెంట్ నంబర్లు ఇచ్చేటప్పుడు సర్వే అనివార్యం. అలాంటి సమయాల్లో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కానీ అనేక వివాదాలకు సర్వే, సబ్ డివిజన్ మ్యాప్స్ చెక్ పెడతాయన్నారు.

సర్వేయర్లకు ఇక ఫుల్ డిమాండ్

కొత్త ఆర్వోఆర్ చట్టం-2024 అమలుకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సర్వేయర్లకు లైసెన్స్‌లను ఇవ్వనున్నారు. ప్రతి మండలంలోనూ ఇద్దరు, ముగ్గురు కనీసం అవసరమయ్యే అవకాశం కనిపిస్తున్నది. లైసెన్సుడ్ సర్వేయర్ల ద్వారానే సర్వే, సబ్ డివిజన్ మ్యాప్స్‌‌ను క్రయ విక్రయాలకు ముందు రూపొందించాలి. వాటిని సర్వేయర్లు ధృవీకరించడం ద్వారానే రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇది ఇప్పుడే అమలు చేయడం లేదు. చట్టం అమలైన తర్వాత గైడ్ లైన్స్ జారీ చేస్తారు. దాంట్లో ఎప్పటి నుంచి మ్యాప్స్ సమర్పించాలనే తేదీని ఖరారు చేయనున్నారు.

Advertisement

Next Story