రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్.. ఎంపీ ఎన్నికల వేళ మైండ్ గేమ్? నెంబర్ గేమ్?

by Prasad Jukanti |   ( Updated:2024-03-12 13:05:28.0  )
రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్.. ఎంపీ ఎన్నికల వేళ మైండ్ గేమ్? నెంబర్ గేమ్?
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకముందే తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ప్రధాన పార్టీల మధ్య ఎత్తుకు పై ఎత్తులు ఆసక్తిగా మారాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ రియాక్షన్స్ ఇస్తున్నారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పేగులు తీసి మెడలో వేసుకుని ఊరేగుతానని రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, ఆ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానిస్తుంటే మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రేవంత్ రెడ్డి సర్కార్ కు పాజిటివ్ గా మాట్లాడటం సంచలనం రేపుతున్నది. అసలే ప్రస్తుతం పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్న తరుణంలో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకలు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.

కేసీఆర్ అలా.. ఎమ్మెల్యేలు ఇలా:

తమ ప్రభుత్వ కూలిపోతుందని వస్తున్న కామెంట్స్ పై నిన్న భద్రాచలం సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం ఈ కామెంట్స్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ ఎమ్మెల్యే(బీఆర్ఎస్) దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివ్ గా మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దానం మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు రోజుకో వరంలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న కృషిలో మేము భాగస్వాములం అవుతామన్నారు. అయితే నిన్న మణుగూరు సభలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు సైతం ఇదే తరహాలో మాట్లాడారు. తమ నియోజకవర్గానికి సీఎం రావడం అంటే దేవుడు వచ్చినంత సంతోషకరమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం మంచి కార్యక్రమం అని ప్రశంసించారు. ఇక గత శనివారం ఎల్బీనగర్ వద్ద బైరామల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎంపీ ఎన్నికలు అయ్యే వరకు ఈ వంతెన ప్రారంభోత్సవం జరగదని తాను భావించానని అయితే సీఎం చొరవతో ఎన్నికలకు ముందే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. నియోజకవర్గ సమస్యలపై త్వరలో స్వయంగా తానే సీఎం వద్దకు వెళ్లి వివరిస్తానని అన్నారు. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేందుకు గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తుంటే మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

మైండ్ గేమా నెంబర్ గేమా?:

ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేల అండకూడా ఉందని వ్యాఖ్యానించడం వెనుక పొలిటికల్ యాంగిల్ ఏంటనే చర్చ జరుగుతోంది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. అయితే వీరంతా పార్టీ మారేందుకు ముందస్తుగా వ్యూహాత్మకంగానే అధికార పక్షానికి, సీఎంకు పాజిటివ్ యాంగిల్ లో మాట్లాడుతున్నారా లేక తమ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నందునా అలా మాట్లాడుతున్నారా అనేది కాలమే సమాధానం చెప్పనున్నది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం అంతా అధికార, ప్రతిపక్షాల మధ్య మైండ్ గేమా లేక నెంబర్ గేమా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed