ముదురుతోన్న.. ‘పరీక్షల’ ఫైటింగ్!..అటు సర్కార్.. ఇటు నిరుద్యోగులు

by Prasad Jukanti |
ముదురుతోన్న.. ‘పరీక్షల’ ఫైటింగ్!..అటు సర్కార్.. ఇటు నిరుద్యోగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో నిరుద్యోగులు మరోసారి కదంతొక్కారు. పోటీ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిరుద్యోగ యువత అర్ధరాత్రి మెరుపు సమ్మెకు దిగారు. నిన్న జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. నియామక పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీని పోస్ట్‌పోన్ చేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను పెంచడంతో పాటు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గత రాత్రి దిల్‌సుఖ్‌నగర్, అశోక్ నగర్ చౌరస్తాలో భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో వెనకడుగు వేసేది లేదంటూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుంటే మరోవైపు నిరుద్యోగులు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించడంతో వ్యవహారం నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారిపోయింది. అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, అశోక్ నగర్ ఏరియాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

సర్కార్‌కు కొత్త తలనొప్పులు..

డీఎస్సీ సర్కారుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వాయిదా వేయాలని నిరుద్యోగులు ఒకవైపు, పోస్ట్‌పోన్ చేసే సమస్యలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు.. ఢీ అంటే ఢీ అంటున్నాయి. టెట్ పరీక్షకు డీఎస్సీ ఎగ్జామ్‌కు అతి తక్కువ రోజుల గ్యాప్ ఉండటంతో ప్రిపరేషన్‌కు ఇబ్బందిగా మారిందని నిరుద్యోగులు చెబుతున్నారు. అలాగే గ్రూప్-1 పోస్టులకు 1:100 నిష్పత్తిలో భర్తీ చేయాలనే డిమాండ్‌తోపాటు గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇటీవలే నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇదికాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు నిరుద్యోగులు, విద్యార్థి నాయకులపై విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు సైతం విడుదల కాగా పరీక్షల నిర్వహణ యథావిధిగా జరుగుతాయని, ఏ పరీక్షలూ రాయని వాళ్లే వాయిదా కోసం దీక్షలు చేస్తున్నారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రకటనతో నిరుద్యోగులు తాజాగా మరోసారి ఆందోళన బాట పట్టారు.

30 లక్షల మందితో ఉద్యమం : అశోక్ సార్

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఢిల్లీలో రైతుల ఆందోళన తరహాలో తెలంగాణలోనూ 30 లక్షల మంది నిరుద్యోగులతో ఉద్యమం చేసి హైదరాబాద్‌ను స్తంభింపజేస్తామని అశోక్ సార్ ప్రకటన చేశారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన ఆయన.. సీఎంకు మైక్ పట్టుకుని మాట్లాడటం తప్ప ఏమీ రాదని, పాలన చేతకాదని, పరిపాలనకు రేవంత్‌రెడ్డి పనికిరారని విమర్శించారు. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి కావాలని.. రేపటి నుంచి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ నిరుద్యోగుల నుంచి రాబోతుందన్నారు. ఢిల్లీని రైతులు మూకుమ్మడిగా ముట్టడించినట్లే హైదరాబాద్‌ను కదలనివ్వమని హెచ్చరించారు. విద్యాశాఖ గురించి ఏం తెలుసని రేవంత్ తన వద్ద ఆ శాఖను అట్టిపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని భావన కలుగుతోందన్నారు.



Next Story