KA Paul : ఢిల్లీలో బీజేపీకి సహకారంపై నిజాన్ని రేవంత్ అంగీకరించారు : కేఏ పాల్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-09 11:42:46.0  )
KA Paul : ఢిల్లీలో బీజేపీకి సహకారంపై నిజాన్ని రేవంత్ అంగీకరించారు : కేఏ పాల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్ లు వేర్వేరుగా పోటీ చేయడం కూడా ఓ కారణమని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే.ఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేరళలో మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి తిరువ‌నంత‌పురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్‌ స‌ద‌స్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల పట్ల ఆయన స్పందించారు.

ఇండియా కూటమి పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీ గెలుపుకు దోహదపడిందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలపై స్పందించిన కే.ఏ.పాల్ ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ సహకరించిందన్న సత్యాన్ని రేవంత్ రెడ్డి అంగీకరించినట్లయ్యిందని పాల్ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, గాంధీ కుటుంబం చేసిన అవినీతికి వారు జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ చెప్పినట్లు ఢిల్లీలో ఆ పార్టీ గెలుపుకు సహకరించారని పాల్ ఆరోపించారు.

ఓ జాతీయ పార్టీగా, 55ఏండ్లు దేశాన్ని ఏలి ఇప్పుడు మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు తొత్తులైన కాంగ్రెస్ పార్టీని దేశంలోని అన్ని ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు కాంగ్రెస్ మోసాలను గ్రహించాలని, దేశంలో ప్రజాశాంతి పార్టీ మాత్రమే మోడీని, అన్ని పార్టీలను ఢీ కొనగల సత్తా ఉన్నదని..అందుకే ప్రజలంతా ప్రజాశాంతి పార్టీ లో చేరాలని పాల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ ను, బీజేపీనీ, బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలన్నారు.

Next Story

Most Viewed