ప్రీలాంచ్‌కి ''రెరా'' గ్రీన్​సిగ్నల్.. అక్రమాలను గుర్తించినా అధికారుల నో యాక్షన్!

by Satheesh |
ప్రీలాంచ్‌కి రెరా గ్రీన్​సిగ్నల్.. అక్రమాలను గుర్తించినా అధికారుల నో యాక్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైద‌రాబాద్‌లో ప్రీలాంచ్ ఆఫర్లకు రెరా అధికార యంత్రాంగం మద్దతు పలుకుతున్నది. తాజాగా బెంగ‌ళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సైతం ప్రీలాంచ్ బాట పట్టింది. రెరా అథారిటీ నుంచి ఎలాంటి అనుమ‌తి పొందకముందే డిసెంబరు నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లను అమ్మే ప్రయత్నాలను చేసింది. ప్రెస్టీజ్ వంటి అతి పెద్ద సంస్థకు కూడా ముందే ఫ్లాట్లు అమ్మేయడం, బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమోచ్చిందని రియల్ ఎస్టేట్ వర్గాలు అనుమానించాయి.

ఇంత బడా సంస్థ రెరా అనుమతులు లేకుండా ఫ్లాట్లను విక్రయించాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రెస్టీజ్ అనగానే వినియోగదారులు క్యూ కడతారు. అలాంటి పేరు, ప్రతిష్టతలు కలిగిన సంస్థ చేపట్టే ప్రాజెక్టులో ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉండే ప్రతికూల పరిస్థితులే ఉండవని ప్రచారం. అడ్డదారుల్లో అమ్మకాలు సాగించాయని రెరా అధికారుల దృష్టికి వెళ్లింది.

కోకాపేటలో ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌ క్లెయిర్‌ మోంట్ పేరిట ప్రాజెక్టులో రెరా అనుమ‌తులకు ముందే త్రిబుల్, ఫోర్ బెడ్రూం ఫ్లాట్స్‌ని విక్రయానికి పెట్టింది. ఫ్లాట్ ధ‌ర‌ కనీసం రూ.కోటిన్నర‌గా ఉంది. ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లను విక్రయించామ‌ని.. బ‌య్యర్ల నుంచి చెక్కులు తీసుకున్నామ‌ని, స్వయంగా సంస్థ ప్రతినిధి అంగీకరించారు.

ఈ క్రమంలో కొంద‌రు ఛానెల్ పార్ట్‌న‌ర్లు ప్రెస్టీజ్ క్లెయిర్‌ మోంట్ ప్రీలాంచ్ సేల్స్ గురించి సోష‌ల్ మీడియాలో ప్రక‌ట‌న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సంస్థ ప్రీలాంచ్ చేసిన నెల రోజులకు రెరా అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరిలో అనుమతినిచ్చి నవంబరులో ఇచ్చినట్లు చూపించడమేమిటి? అంటే అసలు తాము ప్రీలాంచ్లో ఫ్లాట్లు అమ్మలేదని రాంగ్ రూటులో చూపించుకునే ప్రయత్నం ఈ సంస్థ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ఉల్లంఘన

రెరా నిబంధ‌న‌ల ప్రకారం రెరా అనుమ‌తి తీసుకోకుండా ప్రక‌ట‌న‌ల్ని విడుద‌ల చేయ‌కూడ‌దు. ఫ్లాట్లను విక్రయించ‌కూడ‌దు. కాక‌పోతే చెక్కులు తీసుకున్నా.. రెరా వ‌చ్చాకే బ్యాంకులో డిపాజిట్ చేస్తామ‌ని సంస్థ బుకాయించింది. ప్రెస్టీజ్ క్లెయిర్‌మెంట్ ప్రాజెక్టుకు తెలంగాణ రెరా అథారిటీ తాజాగా రెరా అనుమ‌తిని మంజూరు చేసింది. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించే సంస్థ నుంచి తెలంగాణ రెరా అథారిటీ జ‌రిమానా వ‌సూలు చేయాలి. మరి ప్రెస్టీజ్ సంస్థ ఎన్ని ఫ్లాట్లను విక్రయించింది? ఆ సంఖ్యను బ‌ట్టి తెలంగాణ రెరా అథారిటీ జ‌రిమానా వ‌సూలు చేసిందా? ఈ సంస్థ ప్రెస్టీజ్‌ క్లెయిర్‌మెంట్ ప్రాజెక్టును 7.5 ఎక‌రాల్లో చేప‌ట్టింది.

928 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఇందులో వందలాది ఫ్లాట్లను ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ముందే విక్రయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీని బ‌ట్టి ప్రతి ఫ్లాట్ మీద రూ.25 వేలు లెక్కిస్తే రూ.2 కోట్ల వరకు జ‌రిమానా విధించాలి. మ‌రి ఈ సంస్థ రూ.2 కోట్ల జ‌రిమానాను చెల్లించి రెరా నెంబ‌రు తెచ్చుకుందా? లేక ప్రభుత్వ పెద్దల‌ను ఏదో ఒక ర‌కంగా మేనేజ్ చేసి అనుమ‌తి తీసుకుందా? అనే అంశం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రీలాంచ్ పేరిట కాకుండా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పేరు పెట్టినందుకు తోడ్పాటునందించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed