పండగ పూట ఆర్టీసీకి రికార్టు స్థాయిలో ఆదాయం.. ఒక్క రోజే ఎన్ని కోట్లంటే!

by Shiva |
పండగ పూట ఆర్టీసీకి రికార్టు స్థాయిలో ఆదాయం.. ఒక్క రోజే ఎన్ని కోట్లంటే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సంక్రాంతి పండుగ టీఎస్ ఆర్టీసీకి కాసుల పంట పండించింది. ఈ ఫెస్టివల్ సంస్థకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. వరుస సెలవులు, మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈ సారి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 13న 52.87 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.12 కోట్లకు పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 11న 28 లక్షల మంది ప్రయాణించగా, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ 6,261 బస్సులను నడపగా.. ఈ నెల 13న ఒక్కరోజే 1,861 ప్రత్యేక బస్సులను నడిపింది. ఇందులో 1,127 సిటీ బస్సులు వినియోగించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో కేవలం మూడు రోజుల్లోనే కోటీ 50 లక్షలకు పైచిలుకు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యమాజన్యం వెల్లడించింది. ఈ మూడు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని 75 లక్షలకు పైగా మహిళలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది.

Advertisement

Next Story