ఆదాయం ఫుల్... వసతులు నిల్..

by Sumithra |
ఆదాయం ఫుల్... వసతులు నిల్..
X

దిశ, ఆమనగల్లు : ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రకటించుకునే ఆర్టీసీ.. ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు బస్టాండ్ ఏర్పటై 20 ఏండ్లు గడుస్తున్నా నేటికీ విస్తరణకు నోచుకోవడం లేదు. ఆమనగల్లు బస్టాండు అభివృద్ధి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ దృష్టి సారించడం లేదు. 2003లో హైవేను అనుసరించి ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. ప్రతిరోజు వందల బస్సులు, వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారు.

బస్టాండ్లో కనీసం క్యాంటీన్ సదుపాయం కూడా లేదు. ఆర్టీసీ అధికారులు ఆదాయం పై పెట్టిన శ్రద్ధ ప్రయాణికుల సౌకర్యాలు కల్పించడంలో లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. అసలే ఇరుకుగా ఉన్న బస్టాండు ముఖద్వారం దగ్గర ఒకే సమయంలో రెండు బస్సులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు కూర్చోడానికి సరైన సంఖ్యలో కుర్చీలు కూడా లేవు. ఏ బస్సు ఏప్పుడు వస్తుందో తెలిపే సమయసూచిక బోర్డు కూడా ప్రయాణప్రాంగణంలో లేక ప్రయాణికులు ఆర్టీసీ నిర్వహణ పట్ల తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం ఉన్నా శ్రద్ద, వసతుల కల్పనలో లేదని విమర్శిస్తున్నారు. రాష్ట్ర రాజధానికి చేరువలో నాలుగు మండలాలకు కూడలిగా శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఆమనగల్ బస్టాండ్ లో క్యాంటిన్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు అల్పాహారం, చిరుతిల్ల కోసం జాతీయ రహదారి దాటాల్సి వస్తుంది. కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు ప్రధాన ఆదాయ మార్గమైన ఆమనగల్లు బస్టాండ్ విస్తరించి, ప్రయనీకుల వసతులు కల్పించాలని ప్రయనికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed