టికెట్ కోసం ఎత్తుకు పైఎత్తులు..!

by Shiva |   ( Updated:2023-09-27 03:33:41.0  )
టికెట్ కోసం ఎత్తుకు పైఎత్తులు..!
X

దిశ, పెద్దేముల్/తాండూర్: తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాండూర్ టికెట్ కోసం ముఖ్యంగా నలుగురు పోటీ పడుతున్నారు. టికెట్‌ ఎవరిని వరించనున్నాదో త్వరలోనే తేలనుంది. ఇదివరకే తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి అరడజనుకు పైగా దరఖాస్తు చేసుకున్న విషయం విధితమే. అయితే ఫైనల్ లిస్టులో మాత్రం నలుగురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రారంభంలో స్థానిక నాయకుడు రమేష్ మహారాజ్ బరిలో ఉంటానని చెప్పినప్పటికీ ఆయన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి (కేఎల్ఆర్)కు పూర్తి మద్దతు ప్రకటించి బరిలో నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే, మరో నాయకుడు, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే యువ నాయకుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి తాండూర్ నుంచి పోటీకి సై అంటున్నారు.

ఇటీవల తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు సీనియర్ నాయకుడు, తాండూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త డాక్టర్ సంపత్ కుమార్ బీఆర్ఎస్ ను వీడి సొంతగూటికి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాను ఎమ్మెల్యే బరిలో నిలుస్తానని సంకేతాలు ఇచ్చాడు. అలాగే మరో నేత ఆర్బీఎల్ పరిశ్రమ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు సిద్ధమైనప్పటికీ ఫైనల్ లిస్టులో మాత్రం ఈ నలుగురి పేర్లే హస్తినకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయమై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రఘువీరారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డిలకు రేవంత్ రెడ్డి అండ ఉన్నట్లు తెలుస్తుంది.

సీఎంగా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలని పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు రఘువీరారెడ్డి తాండూర్ నియోజకవర్గంనికి పక్క నియోజకవర్గాలైన కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల బడా నాయకుల మద్దతు ఉండటంతో తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అవకాశం ఉందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా కేఎల్ఆర్‌కు భట్టి విక్రమార్క మద్దతు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా తాండూర్ సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ కుమార్‌కు తాండూర్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేక నియోజకవర్గంలో ఈ నలుగురి పేర్లలో ఏ అభ్యర్థి అయితే బాగుంటుందనే దానిపై సర్వేకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.

తెలంగాణలో క్రేజ్ ఉన్నా నాయకుడూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తాండూర్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గం కావడంతో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థినీ పోటీలో నిలిపితే గెలుపు ఖాయమని పలువురి అభిప్రాయం. అయితే, తాండూర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో స్థానిక నాయకులకు టిక్కెట్ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానం చూసుకుంటుందని భావిస్తున్నారు. యువ నాయకుడు రఘువీరారెడ్డి తాండూర్ యువ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ధీటుగా ఉంటారని యువత అంచనాలు వేస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. మొదటి లిస్టులో తాండూరు అభ్యర్థి పేరు ఉండకపోవచ్చని తెలిసింది. రెండు లేదా మూడో విడతలో తాండూర్ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కాంగ్రెస్ అధిష్టానం ఏ అభ్యర్థిని ఖరారు చేసి బరిలో నిలుపుతుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed