సర్వం సమస్యల మయం.. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రోగుల అవస్థలు

by Hamsa |
సర్వం సమస్యల మయం.. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రోగుల అవస్థలు
X

దిశ, వనస్థలిపురం: పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి తీరు. విశాలమైన కట్టడంతో అన్ని హంగులతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. కానీ ఆసుపత్రిలో అన్ని ఉన్న కానీ అక్కడ కొన్ని మాత్రమే పని చేస్తాయి. మొత్తం హాస్పిటల్‌కు ఒకే ఒక్క ఎక్స్‌రే మిషన్ ఉంది. అదికాస్త పనిచేయకపోతే రోగులు ఎక్స్ రే కోసం బయటకు పోవాల్సిందే. ఈ ఆస్పత్రిలో చిన్నచిన్న వ్యాధులకు తప్ప పెద్ద రోగాలు ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్యం కావాలంటే రోగులు గాంధీకి, ఉస్మానియాకు లేదా ఇతర ప్రైవేటు హాస్పిటల్స్‌కు పరుగులు తీయాల్సిందే అనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చామంటూ ఉపన్యాసాలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలకు ఆసుపత్రి సమస్యలు కనిపించకపోవడం భాధకరం అని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏరియా ఆసుపత్రిలో రోగుల అవస్థలు..

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో పలు సాంకేతిక సమస్యలతో ఇక్కడ వైద్య పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రోగులు వాపోతున్నారు. కనీసం రెండు మూడు రోజులు ఐనా తమకు రిపోర్టులు ఇవ్వడం లేదని రోగులు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. వైద్య పరీక్షల రిపోర్టుల కోసం ఆసుపత్రికి వస్తే ఇంటర్నెట్ సాంకేతిక లోపంతో రిపోర్టులు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు, రోగుల తరుపున అటెండర్‌లు తెలిపారు. సర్వర్ ప్రాబ్లమ్‌తో రిపోర్టులు రావడం లేదని అత్యవసరం ఐతే బయట చేయించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని పలువురు దిశకు తెలిపారు.

నీటి కరువు..

ఇంత పెద్ద ఆస్పత్రిలో నీటి కొరత ఎక్కువగా ఉందని, ఉన్న బోరులో తక్కువ పరిమాణంలో నీరు రావడం ఆ నీరు సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రోగులు వారి అటెండర్లులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితం బోర్ వేసినప్పటికీ ఆ బోరులో ఇప్పటివరకు మోటార్ ఫిట్ చేయలేదని తెలిపారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో అందిస్తున్న తాగునీరే ఉపయోగపడుతుందని తెలిసింది.

ఆస్పత్రి ఆర్‌ఎంవో వివరణ..

ఇదే విషయం పై వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ కృష్ణను వివరణ కోరగా ఆస్పత్రిలో ఇంటర్నెట్ సమస్యలతోనే కొన్ని రిపోర్టులు మాత్రమే రావడం లేదు తప్ప ఎక్కువగా ఇబ్బంది లేదన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం రూ.30లక్షల ప్రతిపాదనలు అధికారులకు పంపామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story