విద్యా సంవత్సరం ముగియకముందే మొదలైన అడ్మిషన్ల దందా..!

by Ramesh Goud |   ( Updated:2025-02-11 04:17:48.0  )
విద్యా సంవత్సరం ముగియకముందే మొదలైన అడ్మిషన్ల దందా..!
X

దిశ చేవెళ్ల : రాష్ట్రంలో 2024-2025 విద్య సంవత్సరం పూర్తి కాకముందే చేవెళ్ల పట్టణకేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. అడ్మిషన్ల కోసం సత్య సాయి గ్రామర్ హై స్కూల్, శ్రీ చైత్యన స్కూల్, వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ డే ద స్కూల్ నాలుగు నెలలు ముందు నుంచే పాఠశాలల యాజమాన్యం, పాఠశాల సిబ్బందితో గ్రామాల్లో క్యాన్వసింగ్ చేస్తూ ఇంటింటికీ తిరిగి పాంప్లెట్స్ పంచుతున్నారు. తల్లిదండ్రులకు ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే ఆఫర్స్ ఉన్నాయంటూ చెబుతున్నారు. పైగా బస్సు ప్రయాణం ఉచితం, అడ్మిషన్ ఫీజు కూడా ఉండదంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పాఠశాలలో దాదాపు 500 నుంచి 600 మంది విద్యార్థులున్నా కనీస మౌలిక వసతులు సరిపడా లేకున్నా ఉన్నాయంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. సీబీఎస్సీ సిలబస్ అంటూ ముందస్తు అడ్మిషన్లు తీసుకొంటున్నారని, అక్కడికెళ్లి చూస్తే ఏమీ ఉండడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్స్ తీసుకుంటున్నా పాఠశాలలను అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలను అధికారులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుకుంటున్నారు.

చర్యలు తీసుకోవాలి..

చేవెళ్లలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ సీబీఎస్ఈ సిలబస్ అని పిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఇప్పటినుంచే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. చేవెళ్లలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకునే పలు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. 2025-26 విద్య సంవత్సరానికి ఇప్పటి నుంచే అడ్మిషన్లు తీసుకుంటున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు బేగరి అరుణ్ డిమాండ్ చేశారు.

చర్యలు తీసుకుంటాం..

2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే అడ్మిషన్లు తీసుకోకూడదు. నేను ఈ విషయంపై వివరాలు తీసుకుంటా. అడ్మిషన్లు తీసుకున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో పురాన్ దాస్ అన్నారు.

Next Story

Most Viewed