Dussehra offer:‘100 కొట్టు మేకను పట్టు’.. దసరాకు బంపర్ డ్రా పేరుతో స్కీములు

by Jakkula Mamatha |
Dussehra offer:‘100 కొట్టు మేకను పట్టు’.. దసరాకు బంపర్ డ్రా పేరుతో స్కీములు
X

దిశ, చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా దసరాను జరుపుకుంటారు. అయితే సాధారణంగా ఈ పండుగలకు వివిధ వ్యాపార సంస్థలు అనగా బట్టల దుకాణాలతో పాటు మొబైల్ ఇతర వస్తువులను అమ్మే షాపింగ్ మాల్స్ భారీగా దసరాకు ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షించడం అందరికీ తెలిసిందే. కానీ కొందరు యువకులు ఏమనుకున్నారో ఏమో కానీ మందు, మటన్‌ని కూడా ఆఫర్లలో ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశారేమో దసరా లక్కీ డ్రా పేరుతో వివిధ గ్రామాల్లో మేక, మందు, నాటుకోడిని బహుమతులుగా పెట్టి ఒక్కో కూపన్‌కు వంద రూపాయలు ధర నిర్ణయించి దసరా బంపర్ లక్కీ డ్రా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ద్విచక్ర వాహనాలు, ప్రెజర్ కుక్కర్, ఇంట్లో వంట సామాగ్రిల కోసం కూపన్ ధరలు నిర్ణయించి లక్కీ డ్రాలు తీసేవారు.

తాజాగా గ్రామాల్లో యువకులు మేక, మందు, నాటుకోడిల పేరుతో కూపన్ల ధర నిర్ణయించి లక్కీ డ్రాలు ఏర్పాటు చేయడం స్థానికులను ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. కొందరు పెద్దలు సంస్కృతి ఎటువైపు వెళుతుంది అని అంటుండగా మరికొందరు యువకులు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి రా బాబు అంటూ నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం తాళ్ల సింగారం గ్రామంలోని యువకులు ఇలాంటి ఒక బంపర్ లక్కీ డ్రా పేరుతో ఇప్పటికే దసరాకు ఒక్కో కూపన్ ధర ₹100 తో కూపన్లను సిద్ధం చేశారు.

మొదటి బహుమతిగా 10 కిలోల మేక, రెండో బహుమతిగా 2 బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్, మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా 2 నాటు కోళ్లు,ఐదో బహుమతిగా ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ అందించనున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి కూపన్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా గట్టుప్పల్ మండలం వెలమకన్నె గ్రామంలో కూడా యువకులు ఒక్కో కూపన్ ధర ₹100 నిర్ణయించి 5 బహుమతులను పెట్టారు. మీరు కూడా ఐదు బహుమతులు తాళ్ల సింగారం గ్రామస్తుల లాగానే ఏర్పాటు చేశారు. అయితే వెలమకన్నె గ్రామంలో ఏర్పాటు చేసిన యువకులకు పోలీసుల నుండి ఫోన్లు రావటంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు.




Advertisement

Next Story

Most Viewed