Rangareddy: అధికారుల నిర్లక్ష్యానికి "నిలువెత్తు" నిదర్శనం

by Ramesh Goud |   ( Updated:2024-12-02 02:32:09.0  )
Rangareddy: అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
X

దిశ, తలకొండపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి తాగునీటి ట్యాంకులు నిర్మించారు. అవి ఇప్పుడు నీటి సరఫరాకు నోచుకోవడం లేదు. సుమారు రూ.17 లక్షలతో మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి కోసం 40వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నూతన వాటర్ ట్యాంక్‌ను వెంకట్రావుపేట గ్రామంలో నిర్మించారు. 2023, అక్టోబర్‌లో సుమారు రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకు కేవలం 6,7 నెలలు మాత్రమే సక్రమంగా పనిచేసింది. ప్రస్తుతం గేట్ వాల్ లీకేజీతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వాలు ముందుచూపుతో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి పేదల దాహార్తి కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులు చిన్నచిన్న సమస్యలు తలెత్తితే కూడా స్థానిక అధికారులు కానీ, మిషన్ భగీరథ అధికారులు కానీ వాటిపై దృష్టి సారించలేక, తెలిసి కూడా తెలవనట్లుగా వ్యవహరిస్తూ కేవలం రెండు నుండి మూడు వేల రూపాయలు ఖర్చు పెడితే కొత్త గేటు వాల్ ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవని మొండికేసినట్లు గ్రామస్తులు, మహిళలు వారి బాధలను చెప్పుకొని వాపోతున్నారు.

వెంకటరావుపేట్ గ్రామంలో పక్కపక్కనే రెండు ట్యాంకులు నిర్మించడంతో ఇంకో ట్యాంకు ద్వారా త్రాగు నీటి సరఫరా చేస్తూ అధికారులు మామా అనిపిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వ సొమ్ముతో ప్రజల కోసం నిర్మించిన వాటర్ ట్యాంకు పై అధికారులకు ఎందుకింత నిర్లక్ష్యం అని గ్రామంలోని యువజన సంఘాల నేతలు, కొంతమంది ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంటనే లీకేజీ ప్రాబ్లం ఉన్న గేట్ వాల్ వెంటనే అమర్చి త్రాగునీటి ఇబ్బందులు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి తాగునీటి ట్యాంకు వద్ద పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అధికారులు, మిషన్ భగీరథ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా ట్యాంకు కింది భాగంలో చెత్తా చెదారంతో నిండుకపోయింది. ప్రతిరోజూ ఆ ట్యాంకు వద్దకు వెళ్లి వాటర్ మన్ నీళ్లు వదలడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ చెట్ల పొదల్లో పాములు, తేళ్లు ఉన్నా గుర్తించలేని పరిస్థితి దాపురించింది. స్థానిక పంచాయతీ కార్మికులతో పని చేయించాల్సిన పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి జమీరొద్దీన్‌ను ‘దిశ’ వివరణ కోరగా.. మిషన్ భగీరథ అధికారుల వద్ద గేటు వాల్స్ అందుబాటులో లేవని, గ్రామపంచాయతీ నుంచే ఏర్పాటు చేసుకోవాలని తమకు తెలిపారని, త్వరలో కొత్త గేటు వాల్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed