Protocol Controversy : మంత్రి సభలో ప్రోటోకాల్ వివాదం

by Sridhar Babu |
Protocol Controversy : మంత్రి సభలో ప్రోటోకాల్ వివాదం
X

దిశ, బడంగ్​ పేట్​ : మంత్రి సభలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కాంగ్రెస్​ నాయకులు ప్రోటో కాల్​ పాటించలేదని బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో దాదాపు రూ. 38 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనుల శిలాఫలకాన్ని శనివారం ఐటీ శాఖ, భారీ పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్​ బాబు ప్రారంభించారు. అనంతరం బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం సమీపంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు ప్రోటో కాల్​ పాటించలేదని బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి శ్రీధర్​బాబుతో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులను ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచారు. మంత్రి ప్రోగ్రామ్​ కావడంతో కొంతమంది కాంగ్రెస్​ కార్పొరేటర్లు వేదికపైకి పిలవకున్నా ఎక్కారు. ఇక బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లను ఒక్కొక్కరిని పేరు పేరున పిలవకుండా బడంగ్​పేట్​ కు చెందిన బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లు ఒకేసారి రావాలంటూ సభా అధ్యక్షుడు పిలవడం వివాదంగా మారింది.

కార్పొరేషన్​కు సంబంధం లేని కాంగ్రెస్​ నాయకులను వేదికపైకి పిలిచిన సభా అధ్యక్షుడు బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లను మాత్రం ఒకే సారి రమ్మంటారా? ప్రొటో కాల్​ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జనరల్​ ఫండా? కాంగ్రెస్​ పర్సనల్​ ఫండా ? ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమంలా నిర్వహించారని కార్పొరేటర్లు మండిపడ్డారు. బడంగ్​ పేట్​ కార్పొరేటర్లకు ఇది అవమానకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బడంగ్ పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మైక్​ అందుకుని కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బడంగ్ పేట్​ కార్పొరేషన్​లో జరుగుతున్న మొట్టమొదటి అభివృద్ది పనులని వ్యతిరేకించ వద్దని అంటూనే, గతంలో మీకు ప్రోటోకాల్​ గుర్తు రాలేదా ? అంటూ దుయ్యబట్టారు. అనంతరం మంత్రి శ్రీధర్​ బాబు సైతం కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్​ఎస్​, బీజేపీ కార్పొరేటర్లు వెనుదిరిగారు. అయితే కావాలనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రోటోకాల్ వివాదం తెరమీదకి తీసుకొస్తున్నారని ప్రతి ఒక్కరిని స్టేజీ మీదకి ఆహ్వానించామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్​బాబు, మహేశ్వరం ఇంచార్జి కేఎల్​ ఆర్​లు స్థానిక ఏసీపీ, మీర్​పేట్​ ఇన్​స్పెక్టర్ లపై ఎందుకు కంట్రోల్​ చేయలేక పోయారని కాస్త సీరియస్​ అయ్యారు. అనంతరం మంత్రి శ్రీధర్​ బాబు మాట్లాడుతూ ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత

బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అంతేగాకుండా అర్హులైన నిరుపేదలందరికీ అతి త్వరలో ఇండ్లు కట్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు యునిఫాంలను ఇంతకుముందు ప్రైవేట్​ వారికి ఇచ్చి కుట్టించేవారని, ప్రస్తుతం స్వశక్తి మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలను కుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కొన్ని మహిళా సంఘాలను గుర్తించి, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తూ, ఇందిరా మహిళా క్యాంటిన్​ లు ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైందన్నారు. బడంగ్ పేట్​ కార్పొరేషన్​ పరిధిలో పాఠశాలలో ఎక్కడయితే టాయిలెట్స్​ లేవో అక్కడ టాయిలెట్స్​ నిర్మించి ఇస్తామని చెప్పారు. చాలా మందికి రేషన్​ కార్డులు లేవని, కొత్త రేషన్​ కార్డులు కావాలని అడుగుతున్నారని,

గత 10 సంవత్సరాలలో రేషన్​ కార్డులు ఇవ్వలేదని, కొత్త రేషన్​ కార్డులు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. అంతేగాకుండా స్థానిన పుష్ప అనే మహిళ దరఖాస్తు ఇచ్చిన నెలరోజులు అవుతున్నా తమకు ఉచిత కరెంటు పథకం అమలుకావడం లేదని మంత్రి శ్రీధర్​ బాబు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో స్పందించిన మంత్రి శ్రీధర్​ బాబు పుష్పమ్మ ఉచిత కరెంట్ పథకం​ ఎంతవరకు వచ్చిందని బడంగ్ పేట్​ కమిషనర్​​ రఘును నిలదీశారు. ఉచిత కరెంటు పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలయ్యేలా చూడాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ భూపాల్​ రెడ్డి, కందుకూర్​ ఆర్డీఓ సూరజ్​కుమార్​, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి కేఎల్​ఆర్​, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్​ పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, బడంగ్ పేట్​ డిప్యూటీ మేయర్​ ఇబ్రాం శేఖర్, బడంగ్ పేట్​ కమిషనర్​ జి.రఘు తో పాటు కార్పొరేటర్లు తోట శ్రీధర్​రెడ్డి, సూర్ణగంటి అర్జున్​ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed