ఈ వాగులు దాటేదెట్లా...?

by Sumithra |
ఈ వాగులు దాటేదెట్లా...?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : వర్షాలు కురిసిన ప్రతీసారి జిల్లాలోని పలుప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగునెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని కొన్ని గ్రామాలకు వరద ఉదృతి తగ్గితే తప్పా వాగులు దాటి వెళ్లే పరిస్థితి లేదని చెప్పవచ్చు.

కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలంలో సుద్దపల్లి వాగు, కడ్తాల్​ మండలంలో ముద్వీన్​ వాగు, ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వాగులతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు మరో దారి వెతుక్కోవాలి. లేదంటే ఆ ఊరికే ప్రజలు పరిమితమైపోతున్నారు. అదేవిధంగా మంచాల, యాచారం, చేవెళ్ల, షాబాద్, కేశంపేట్, కోందుర్గ్​ మండలాలో భారీ వర్షాలు వచ్చినప్పుడు వాగు ఉదృతి పెరుగుతున్నప్పుడు రాకపోకలు నిలిచిపోతాయి.

ప్రమాదాలకు కారకులెవరు..?

రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల మండలం సుద్దపల్లి వాగు, కడ్తాల్​ మండలంలోని ముద్విన్​ వాగు వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు ధఫాలుగా అధికారంలోకి వచ్చింది. కానీ స్ధానిక ప్రజలు ప్రజాప్రతినిధులను నిలదీస్తే స్పందించాల్సిన నేతలు మొఖం చాటేస్తున్నారు. అంతేకాకుండా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికి ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం దారుణమని స్ధానిక ప్రజలు విమర్శిస్తున్నారు.

మాడ్గుల మండలం నుంచి ప్రతిరోజు వేలమంది సుద్దపల్లి వాగు ద్వారనే హైదరాబాద్ కు రవాణా చేస్తారు. ప్రధానంగా అర్కపల్లి, నర్సంపల్లి, పల్గుతండా, జర్పుల తండా, కుబ్యెతండా, అందుగుల, అంతంపేట్, పల్లె తండా గ్రామాల ప్రజలు ఈ వాగు గుండా వెళ్లాల్సిందే. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రోజువారి కూలీలు, ప్రైవేట్​ ఉద్యోగులు, వ్యవసాయ రైతులు నిత్యం సుద్దపల్లి వాగు గుండానే ప్రయాణిస్తారు.

బైక్​పై ప్రయాణిస్తే ఇక అంతే సంగతులు... ట్రాక్టర్, ఆటో, ఇన్నోవా కార్లు సైతం ఈ వాగులో ప్రమాదానికి గురైయ్యాయి. ముద్వీన్​ వాగుతో చరికొండ, ముద్వీన్, పల్లేచెలుక, ఆకుతోటపల్లి, గౌరారం, శెట్టిపల్లి, బోయిన్​గుట్ట తండాల ప్రజల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈ బ్రిడ్జి కూలిపోవడంతో గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే బయటికి వెళ్లే పరిస్థితిలేదు. ఆ వాగు ద్వారా ప్రయాణీస్తే అనేక ప్రమాదాలు సంబవిస్తున్నాయి.

యేండ్లు గడుస్తున్నా స్పందన లేదు...

కడ్తాల్​ మండలంలోని ముద్వీన్​ వాగు కూలీపోయి 15 యేండ్లు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు. సుద్దపల్లి గ్రామవాగు మరమ్మత్తుల కోసం స్ధానిక ఎమ్మెల్యేకు పలుమార్లు విన్నవించిన ఫలితం లేదని స్ధానికులు వివరిస్తున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సందర్భంలో ప్రతిపాదనలు చేసి, ప్రభుత్వానికి పంపించామనే ముచ్చటతోనే ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దీర్ఘకాలీక సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు విఫలమైతున్నారు.

సంక్షేమానికే పరిమితమా...?

రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల అమలుకే పరిమితమైతుందా, ప్రజా సమస్యలను పట్టించుకుంటుందా అనే చర్చ ఆయా గ్రామాల ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ఎన్నికలొచ్చినప్పుడు సమస్యలపై హామీలు ఇవ్వడం, ఎన్నికలు ముగిసిన తర్వాత సమస్యలను గాలికి వదిలేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. ఎంతో కాలంగా ప్రయాణానికి ఇబ్బందిపడే సమస్యలను తీర్చాల్సిన నేతలు ఆ ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ ఊర్లకు వెళ్లలేని దుస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు సమస్యలను పరిష్కరించాలని ఆవేదవ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story