శుభప్రద్ పటేల్ ఇంటికి ఎమ్మెల్యే ఆనంద్

by Sumithra |   ( Updated:2023-09-29 15:54:57.0  )
శుభప్రద్ పటేల్ ఇంటికి ఎమ్మెల్యే ఆనంద్
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, వికారాబాద్ వాసి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ తో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ భేటి అయ్యారు. శుక్రవారం వికారాబాద్ ఆలంపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత నాలుగేళ్లలో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాల పై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో వికారాబాద్ జిల్లా నుండి ఉద్యమ నాయకుడిగా ప్రాతినిధ్యం వహించిన శుభప్రద్ పటేల్, 2018 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు టిక్కెట్ రావటంలో, ఆయన గెలుపులో కూడా కీలకంగా వ్యవహరించారు.

ఉద్యమకారుడిగ 2003 నుంచి పార్టీలో క్రియాశీలంకంగా వ్యవహరిస్తున్నారు. నాడు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపారు. గతకొన్ని రోజులుగా శుభప్రద్ పటేల్, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మధ్యలో దూరం పెరిగింది. ఎన్నికల్లో పనిచేసిన వారిని పక్కన పెట్టి పనిచేయని వారికి పదవులు ఇవ్వడం పై శుభప్రద్ పటేల్ తప్పుబట్టారు. గెలుపునకు కృషి చేసిన లీడర్లను పక్కన పెట్టడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పదవుల విషయంలో వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఈ విషయంలో స్పందించిన ఎమ్మెల్యే ఆనంద్ తన తరపున కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునారావృత్తం కాకుండా చూస్తానని, అందరికి కలుపుకొని ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే ఆనంద్, శుభప్రద్ పటేల్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని కోరగా, నాతో పని చేసిన ఉద్యమకారులు, పార్టీ నేతలతో చర్చిస్తానని శుభప్రద్ పటేల్ ఎమ్మెల్యేకు చెప్పినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story