రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పండి: మంత్రి

by Disha News Web Desk |   ( Updated:2022-01-27 11:01:13.0  )
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పండి: మంత్రి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: స్వాతంత్ర్య భారతావనికి దశ, దిశ చూపిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన మహోన్నతమైన రోజును జరుపుకునే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం అంత ముఖ్యమని, సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి నేటికి సరిగ్గా 72 ఏళ్ళు పూర్తి అయిందని, 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయంటే అది రాజ్యాంగం మనకు కల్పించిన అవకాశం మాత్రమే అని అన్నారు. విధులను పాటిస్తూ, హక్కులను అనుభవిస్తూ, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. భారతావనికి మహనీయులు అందించిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యంగాన్ని మనకు అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ని యావత్ జాతి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ ఫలాలు అట్టడుగున ఉన్నవారికి అందించటానికి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని సబితా రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story