- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు..

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన వెల్జాల్ గ్రామ సమీపంలోని ఎత్తైన కొండలపై వెలసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసమూర్తి శర్మ తో పాటు మరికొంతమంది భక్తుల సహాయ సహకారాలతో అంచెలంచెలుగా దినదినాభివృద్ధి లో భాగంగా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెల్జాల్ గ్రామం తో పాటు పరిసర గ్రామాలలోని దాతలు రాజకీయ నాయకుల సహాయ సహకారాలు అందించడం తో సుమారు రూ.5 కోట్లకు పైగా వెచ్చించి ప్రస్తుతం ఈ దేవాలయాన్ని చూడ ముచ్చటగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఈ దేవాలయం ముందు భాగంలో సుమారు 55 ఫీట్ల ఎత్తైన ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి కూడా దేవాలయ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పిటిసి, ఎంపీపీ నిధుల నుండి సుమారు 30 లక్షల మేర నిధులు వచ్చినట్లు తెలిపారు. మిగతా డబ్బులన్నీ దాతల సహకారంతోనే రూపకల్పన చేశారు. అదేవిధంగా ప్రస్తుత కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా వేదాద్రి ఆలయ అభివృద్ధి కోసం మరో ఐదు కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఈ ఎత్తైన కొండలపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రాంగణంలో క్రీస్తుకు పూర్వం మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నట్లు ఇక్కడి భక్తులు చర్చించుకుంటారు. గతంలో ఈ దేవాలయంలోని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శన భాగ్యం కలగాలంటే భక్తులు కాలినడకన పైకి చేరుకొని పెద్ద బండరాయి కింద ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడానికి అతి కష్టం మీద క్రిందికి వంగి, బండపై పడుకొని లోనికి ప్రవేశించి లక్ష్మీనరసింహున్ని దర్శించుకునేవారు. ప్రస్తుతం స్వయంభుగా వెలిసిన ఈ లక్ష్మీ నరసింహ స్వామి దర్శన భాగ్యం కోసం బండరాయిని భారీ స్థాయిలో తొలిచి లోనికి సులువుగా వెళ్లి దర్శనం చూసుకునే విధంగా తయారు చేశారు. గుట్ట పైకి వెళ్లడానికి వెల్జాల్ నుంచి మిడ్జిల్ వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు వద్ద చూడముచ్చటైన ముఖద్వారాన్ని నిర్మించారు. ముఖ ద్వారం నుండి గుట్టపైకి చేరుకోవడానికి సిసి రహదారిని కూడా గత రెండు సంవత్సరాల క్రితం అందించారు నిర్మించారు. వెల్జాల్ గ్రామానికి ఈశాన్య దిక్కుకు నియోజకవర్గంలోనే అతిపెద్దదైన చెరువు అయినా సహదేవి సముద్రం దర్శనమిస్తుంది. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు నెరవేర్చడంలో కొంగుబంగారం. యాదగిరిగుట్ట లోని లక్ష్మీ నరసింహ స్వామిని మైమరిపించే రీతిలో వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని విద్యుత్ దీపాల అలంకరణతో చూడముచ్చటగా తయారు చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ దేవాలయంలో 13 రకాల విగ్రహమూర్తుల ప్రతిష్టాపన హైలెట్..
లక్ష్మీ నరసింహ స్వామి దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను ఆకట్టుకోవడానికి దేవాలయ ప్రాంగణంలో సుమారు 13 రకాల విగ్రహాలను చూడముచ్చటగా అలంకారప్రాయంగా ఏర్పాటు చేశారు. అందులో శ్రీ మాలోల నరసింహ స్వామి, శ్రీ పావన నరసింహ స్వామి, శ్రీ జ్వాలా నరసింహ స్వామి, శ్రీ క్రోడా నరసింహ స్వామి, శ్రీ యోగానంద నరసింహ స్వామి, శ్రీ చత్రవట నరసింహ స్వామి, శ్రీ అహోబిల ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ కారంజ నరసింహ స్వామి, శ్రీ భార్గవ నరసింహాస్వామి, శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ మహాగణపతి స్వామి, శ్రీ మహా సరస్వతీ దేవి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి విగ్రహమూర్తులు చూడముచ్చటగా దర్శనమిస్తాయి. ఈనెల 7న ప్రారంభమై మూడు రోజుల పాటు 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు ఆలయ నిర్వహకులు పేర్కొన్నారు. ఈనెల 7న గణపతి పూజ, స్వస్తివాచనం, స్వామి వారి అభిషేకము, లక్ష పుష్పార్చన. 8 న మహా సుదర్శన హోమం, మహాభిషేకం, లక్ష పుష్పార్చన, బండ్లు తిప్పడం, అదే రోజు రాత్రి కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారి ప్రవచనములు, 9 న గణపతి ప్రార్థన, గురు వందనం, మంటప పూజ, చక్కెర తీర్థం, అలయబలి, పూర్ణాహుతి, పుష్పార్చన కార్యక్రమాలతో పాటు లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు పేర్కొన్నారు.
ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి, గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ ఠాగూర్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు కేబీఎన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆలయ ముఖ్య నిర్వహకులు శ్రీనివాస మూర్తి శర్మ పేర్కొన్నారు.