అకాల వర్షాలతో చిరు వ్యాపారుల విలవిల

by sudharani |   ( Updated:2023-05-03 03:38:52.0  )
అకాల వర్షాలతో చిరు వ్యాపారుల విలవిల
X

దిశ, శేరిలింగంపల్లి : వర్షాకాలం మాదిరిగా వేసవి కాలంలోనూ ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలు అన్నదాతలనే కాదు చిరు వ్యాపారులను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లో వరి ధాన్యం తడిసి ముద్దవుతుండగా నగరంలో ఈ అకాల వర్షాల వల్ల చెట్లు నేలకూలి, డ్రైనేజీలు మ్యాన్ హోల్స్ వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగిపోతున్నాయి. దీంతో చిరు వ్యాపారులు అనునిత్యం ఇబ్బందులు పడుతున్నారు.

వలస జీవులపై వర్షపు పిడుగు..

పొట్ట చేతపట్టుకుని రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి నగరానికి వలస వచ్చిన పల్లె జనం వేసవికాలం కావడంతో అప్పులు చేసి మరీ అక్కడక్కడ చెరుకు రసం బండ్లు, జ్యూస్ సెంటర్లు, సోడా బండ్లు, కొబ్బరి బోండా షాపులు ఇలా అనేక చిరు వ్యాపారాలను మొదలుపెట్టారు. ఇందుకోసం రోజు వారి ఫైనాన్స్ వ్యాపారుల వద్ద అప్పులు చేసి వచ్చిన ఆదాయంలో ఏ రోజుకు ఆరోజు కొంత మొత్తం డబ్బులు చెల్లిస్తూ వ్యాపారాలు సాగిస్తుంటారు. ఇవన్నీ కూడా కేవలం వేసవి సీజన్‌లోనే నడుస్తాయి. అయితే ఈ అకాల వర్షాలు చిరు వ్యాపారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. వేసవి తాపానికి కొబ్బరి బోండాలు, చెరుకు రసం, సోడాలు తాగే వారు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో అటు వైపు కన్నెత్తిచూడడం లేదు. దీంతో వేసవి కాలంలోనూ గిరాకీలు లేక చిరు వ్యాపారుల దుకాణాలు వెలవెలబోతున్నాయి.

అప్పులు చేసి తిప్పలు..

ఈ వేసవి సీజన్‌లో సోడా బండి, చెరుకు బండి, కొబ్బరి బోండా షాపులు పెట్టి నాలుగు డబ్బులు కూడా బెట్టుకుని తిరిగి వర్షాకాలంలో ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని ఎన్నో ఆశలతో నగరానికి వలస వచ్చిన వారు ఇక్కడ డైలీ ఫైనాన్స్ తీసుకుని వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇలా డైలీ ఫైనాన్స్‌లో రూ.10వేలు తీసుకున్న వారు రోజుకు వంద రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, కానీ వర్షాల వల్ల గత 10 రోజులుగా గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరుములు, గిరాకీలు లేక డైలీ ఫైనాన్స్ కట్టలేక, పిల్లలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కొబ్బరి బోండాలు కొనేవారే లేరు..

వర్షాల వల్ల కొబ్బరి బోండాలు అమ్ముడు పోవడం లేదు. ఎండాకాలంలో రోజుకు 200 నుంచి 300 బోండాలను అమ్మే వాళ్లం. కానీ వర్షాల వల్ల ఇప్పుడు రోజుకు 50 నుంచి 100 బోండాలను కూడా అమ్మలేక పోతున్నాం. ఈ సీజన్‌లో సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది.

- మూర్తి, భీమవరం, వెస్ట్ గోదావరి

మా బతుకును ఆగం చేస్తున్నాయి

ప్రతీ ఎండాకాలంలో నగరానికి వలస వస్తుంటాం. ఇక్కడికి వచ్చి చెరుకు బండ్లు నడిపించుకుంటాం. ఏప్రిల్ నుంచి మే మొదటి వారంలోనే మాకు మంచిగా గిరాకీలు ఉంటాయి. ఈసారి ఏప్రిల్ నెలాఖరు నుంచి వర్షాలు పడుతున్నాయి.

- యాదమ్మ, శంకరంపేట్

మా పొట్టమీద కొడుతున్నాయి

ఎండాకాలం వచ్చిందంటే మేము శేరిలింగంపల్లి ప్రాంతానికి వలస వచ్చి సోడా బండి పెట్టుకుని బతుకుతాం. కానీ ఈ ఎండాకాలం పెద్దగా గిరాకీలు లేవు, వర్షాల వల్ల సోడా తాగేవారే కరువయ్యారు. వాతావరణం చల్లబడితే మాకు గిరాకీలు ఉండవు. ఈ అకాల వర్షాలు మా ఉపాధిని దెబ్బ తీశాయి.

- కృష్ణ, నారాయణఖేడ్

Also Read: బిగ్ అలర్ట్ : మరో మూడు రోజులు దంచి కొట్టనున్న వర్షాలు..

Advertisement

Next Story

Most Viewed