- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెద్దల చేతుల్లో పేదల భూములు..!
దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ భూములను కాపాడడంలో బీఆర్‌ఎస్ విఫలమైందని ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇదే విషయం కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అధికారుల వైఖరిలో మార్పులు లేవంటూ ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వం రెవెన్యూ శాఖపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నది. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలతో దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ మండల స్థాయిలోని అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కనిపించినట్లు లేదు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి ఎకరం ధర విలువైనదే. ఇలాంటి భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంటుంది. కానీ ఆ రెవెన్యూ అధికారులు ఎవరు కబ్జా చేస్తే మాకేంటి.. అసైన్డ్ భూమి పట్టా భూములైనా మాకేం సంబంధం అన్నట్లు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం గమనార్హం.
కోట్ల విలువైన భూమి కబ్జా..
రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా భూ లావాదేవీలను కొనసాగించి కోట్ల విలువైన భూములను కబ్జాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంకరపురం గ్రామంలోని సర్వే నంబర్ 24లో మొత్తం ప్రభుత్వ భూమే. ఇందులో కొంత భూమి పేద, మధ్య తరగతి రైతులకు అసైన్డ్ చేశారు. అయితే అసైన్డ్ రైతులు సర్వే నంబర్ 24లోని 20 ఎకరాల భూమిని ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. ఆ వ్యాపారి అసైన్డ్ భూమిని పట్టాగా మార్పుచేసుకొని ప్లాట్లుగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని క్రయ విక్రయాలు చేయడం చట్టరీత్యా నేరం. ఒకవేళ క్రయవిక్రయాలు చేస్తే కొనుగోలుదారులపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులు తమ అవసరాల కోసం విక్రయించడం చట్టరీత్యా నేరం. కానీ ప్రభుత్వ అధికారులే ఆ భూమిని ఆధీనంలోకి తీసుకున్నప్పుడు రెవెన్యూ చట్టం ప్రకారం నష్టపరిహారం రైతులకు చెల్లిస్తుంది. అసైన్డ్ భూమిపై రైతులకు పూర్తి హక్కులుండవ్. సాగు చేసుకునేంత వరకే అర్హులనే విషయం అధికారులకు, రైతులకు గుర్తు చేయాలి. అదే రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
ఏ నిబంధనల ప్రకారం క్రయవిక్రయాలు..
అక్రమంగా కబ్జాచేసుకొని ఓ వ్యాపారి క్రయవిక్రయాలు చేయడం ఏ నిబంధనలకు లోబడి ఉంటుంది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం పెద్ద నేరం. మళ్లీ ఆ అసైన్డ్ భూమిలో అధికారుల మద్దతుతో నాలాగా మార్పుచేసి నిర్మాణాలు చేయడం మరో నేరం. అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన వ్యాపారి తప్పుమీద తప్పు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం ఏ నిబంధనలకు వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆ వ్యాపారితో శంషాబాద్ రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వరుసగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారిని సంప్రదిస్తే అసైన్డ్ భూమి పట్టాగా మారింది కనుక రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.