కాంగ్రెస్‌కు కలిసొచ్చిన మరో ప్రాంతం.. వచ్చే‌నెల ఫస్ట్ వీక్‌లో భారీ బహిరంగ సభ!

by GSrikanth |
కాంగ్రెస్‌కు కలిసొచ్చిన మరో ప్రాంతం.. వచ్చే‌నెల ఫస్ట్ వీక్‌లో భారీ బహిరంగ సభ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్‌గా భావిస్తున్నది. ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికల కోసం సౌతిండియా క్యాంపెయిన్ ను మొదలుపెట్టనున్నది. స్వయంగా ఏఐసీసీ, ఈ విషయాన్ని స్టేట్ లీడర్లకు వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ప్రచారాన్ని షురూ చేయనున్నారు. ఈ మీటింగ్ కు ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తదితర కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సభలో మేనిఫెస్టోతోపాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షోల షెడ్యూలను కూడా విడుదల చేసే అవకాశమున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర పార్టీ తగిన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఈ సభను సక్సెస్ చేసేందుకు అన్ని జిల్లాల అధ్యక్షులు చొరవ చూపాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఆదేశాలిచ్చారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మెయింటెనెన్స్ తదితర కార్యక్రమాల కోసం కో– ఆర్డినేట్ టీమ్ లను కూడా సెలెక్ట్ చేశారు. ఒకటి రెండ్రోజుల్లోనే తుక్కుగూడ లో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను మొదలు పెడతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.

పది లక్షల మందితో..

లోక్ సభ షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సభను కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించాలని భావిస్తున్నది. తెలంగాణ నుంచే దేశ విజయానికి నాంది పలకాలని రాష్ట్ర నేతలు ఆశిస్తున్నారు. దాదాపు పది లక్షల మందితో సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి మినిమం 25 వేల మందికి తగ్గకుండా ఈ సభకు తరలించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే జన సమీకరణ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ అప్పగించింది. ఆర్టీసీ బస్సులను కూడా ముందస్తుగానే బుక్ చేసుకోవాలని టీపీసీసీ అన్ని జిల్లాలకు ఆదేశాలిచ్చింది. ఇక వచ్చిన నేతలు, పార్టీ కార్యకర్తల కోసం స్నాక్స్, పులిహోర వంటి ఫుడ్ ను కూడా అందించేందుకు నేతలు చర్చించుకుంటున్నారు. ఈ సభ ఏర్పాట్లు, నిర్వహణపై రెండు మూడు రోజుల్లో గాంధీభవన్ లో కో ఆర్డినేషన్ మీటింగ్ జరగనున్నది. ఆ సమీక్ష తర్వాత ఏర్పాట్లపై ఓ క్లారిటీ వస్తుందని పార్టీ కి చెందిన ఓ నేత స్పష్టం చేశారు.

ఇక్కడే ఎందుకు అంటే!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆరు గ్యారెంటీలను ప్రకటించేందుకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నది. గత ప్రభుత్వం ఈ సభకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చొరవతో సభ సక్సెస్ అయ్యేలా వ్యూహాలు అమలు చేశారు. గతేడాది సెప్టెంబరు 17న మీటింగ్ ను నిర్వహించారు. ఏకంగా సోనియా గాంధీ చేతుల మీదుగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకువస్తే, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తనది అంటూ ఈ సభ వేదికగా సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. తద్వారా ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైకమాండ్ లో మరింత నమ్మకం పెరిగింది. దేశంలోనూ పవర్ లోకి వస్తామని బలంగా నమ్ముతున్నారు. దీంతో సోనియా గాంధీ ఆదేశాలు మేరకు మళ్లీ తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ ముందుకు సాగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed