BIG NEWS : నిరుద్యోగుల సమస్యలపై ప్రొఫెసర్ కోదండరామ్ భరోసా

by Ramesh N |
BIG NEWS : నిరుద్యోగుల సమస్యలపై ప్రొఫెసర్ కోదండరామ్ భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగ సమస్యలపై టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టంచేశారు. అభ్యర్థుల సమస్యలపై ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు తాను కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి వివరించినట్లు వెల్లడించారు. తాము చెప్పిన విషయాలపై చైర్మన్ చాలా సిరియస్‌గా విన్నారని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ఆవేదన, ఆందోళన గురించి వివరించామని చెప్పారు. పోస్టులు వస్తాయో రావో అని భయం ఒకవైపు.. ప్రస్తుతం పరీక్షల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి పరిష్కారం అడిగామన్నారు.

గ్రూప్-1లో పోస్టుల సంఖ్య పెంచడం, గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 1:100 నిష్పత్తితో సెలక్ట్ చేయడంపై చైర్మన్‌కు వివరించామని వెల్లడించారు. అదేవిధంగా డీఎస్సీ, గ్రూప్- 2 పరీక్షకు సమయం లేనందున వాయిదా వేయాలని వివరించామన్నారు. ఈ రెండు పరీక్షలను వాయిదా వేసి.. కొంత వ్యవధి ఉండేలా చూస్తే అప్పుడు అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని స్పష్టంగా చెప్పామన్నారు. వీటన్నింటి పై చైర్మన్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పినట్లు వెల్లడించారు. నిరుద్యోగుల సమస్యలపై తాము క్రియాశీలకంగా స్పందిస్తున్నామని అన్నారు. గతంలో మాదిరిగానే నిబద్దతతో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్పష్టంచేశారు. తప్పకుండా తమ బాధ్యతలు నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed