Pranit Rao: సూచనల మేరకే ట్యాపింగ్ ​చేశా.. ఇంతకన్నా ఏమీ చెప్పలేను

by Shiva |
Pranit Rao: సూచనల మేరకే ట్యాపింగ్ ​చేశా.. ఇంతకన్నా ఏమీ చెప్పలేను
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నాకు అందిన సూచనల మేరకే ఫోన్లు ట్యాపింగ్​చేశా.. ఇంతకన్నా ఏమీ చెప్పలేను. కస్టడీలో మొదటి రోజు సస్పెండెడ్​డీఎస్పీ ప్రణీత్​రావు విచారణ బృందం అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలివి. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఫోన్లను ట్యాపింగ్​చేసినట్టు అంగీకరించిన ప్రణీత్​రావు ఈ వ్యవహారం వెనక ఎవరెవరు ఉన్నారన్న దానిపై మాత్రం పెదవి విప్పలేదని తెలిసింది. కొన్ని ఆధారాలను ముందు పెట్టి సూటిగా అడిగిన ప్రశ్నలకు సైతం ప్రణీత్​రావు పెద్దగా జవాబులు ఇవ్వలేదని సమాచారం. సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్​వ్యవహారంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్​రావును ఈనెల 13న పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆ తరువాత ఈ కేసు విచారణను జూబ్లీహిల్స్ ​ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందానికి అప్పగించారు. ఈ క్రమంలో ఫోన్​ట్యాపింగ్​వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉన్నందున ప్రణీత్​రావును కస్టడీకి అనుమతించాలని కోరుతూ.. అధికారులు నాంపల్లి కోర్టులో పిటీషన్​దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రణీత్​రావును వారం రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక విచారణ బృందం చెంచల్​గూడ జైలుకు వెళ్లి ప్రణీత్​రావును కస్టడీలోకి తీసుకుంది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం ప్రణీత్​రావును తమతోపాటు తీసుకెళ్లిన విచారణ బృందం అతన్ని ప్రశ్నించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితోపాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోని పలువురు కీలక నేతల ఫోన్లను ప్రణీత్​రావు ట్యాప్​చేసి ఎప్పటికప్పుడు వివరాలను బీఆర్ఎస్​లోని కొందరు కీలక నాయకులకు అందచేసినట్టుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం అదుపులోకి తీసుకున్న తరువాత ప్రత్యేక విచారణ బృందం ఈ కోణంలోనే ప్రణీత్​రావును ప్రశ్నించినట్టుగా సమాచారం. ఎవరి సూచనల మేరకు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్​చేశారు, ఎవరెవరికి సమాచారాన్ని అందించారు అన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలిసింది. అయితే, ప్రణీత్​రావు ఈ ప్రశ్నలకు పెద్దగా సమాధానాలు చెప్పలేదని తెలియవచ్చింది. పై అధికారుల నుంచి అందిన సూచనల మేరకే తాను ఫోన్లను ట్యాప్​చేసినట్టు సమాధానమిచ్చినట్టు తెలిసింది. ట్యాపింగ్​లో వెల్లడైన వివరాలను తనకు సూచనలు చేసిన అధికారులకు పంపించానని చెప్పినట్టుగా సమాచారం.

ఆధారాల ధ్వంసంపై ఆరా..

ఇదిలా ఉండగా డిసెంబర్​4న ప్రణీత్​రావు ఎస్ఐబీ కార్యాలయంలో తనకు కేటాయించుకున్న రెండు గదుల్లోని 17 కంప్యూటర్లలోని డేటాను పూర్తిగా ఎరేజ్​చేయటంతోపాటు కొన్ని హార్డ్​డిస్కులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ప్రత్యేక విచారణ బృందం అతన్ని ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఎవరి సూచనల మేరకు ఈ పని చేశారన్న ప్రశ్నకు ప్రణీత్​రావు పెద్దగా జవాబులు ఇవ్వలేదని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్​ పార్టీలోని కీలక నేత ఎర్రబెల్లి దయాకర్​రావు పోటీ చేసిన పాలకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా వార్​రూం ఏర్పాటు చేసి ఫోన్లను ట్యాప్ ​చేసినట్టుగా ఉన్న అనుమానాలపై ప్రశ్నించినపుడు కూడా ప్రణీత్​రావు మౌనంగానే ఉండిపోయినట్టు తెలియవచ్చింది. ఏయే నియోజకవర్గాల్లో వార్​రూంలు ఏర్పాటు చేశారన్న ప్రశ్నకు కూడా సమాధానమివ్వలేదని సమాచారం.

వరంగల్​కు చెందిన ఇద్దరు సీఐల పాత్ర..?

ఇదిలా ఉండగా సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో వరంగల్​కు చెందిన ఇద్దరు సీఐల పాత్ర కూడా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఈ ఇద్దరు సీఐలు వరంగల్​అర్భన్​లో విధులు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందానికి కొన్ని ఆధారాలు కూడా దొరికినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఫోన్​ ట్యాపింగుల వ్యవహారంలో ప్రణీత్​రావుకు దాదాపు 30మంది సిబ్బంది సహకరించినట్టుగా విచారణ బృందం గుర్తించినట్టు సమాచారం. వీరందరికీ సీఆర్పీసీ 41 సెక్షన్​ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. వీరితోపాటు తాజాగా వెలుగులోకి వచ్చిన వరంగల్​సీఐలను సైతం ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది.

Advertisement

Next Story

Most Viewed