కూల్చివేతలపై అధికార..ప్రతిపక్షం ట్విటర్ యుద్దం

by Y. Venkata Narasimha Reddy |
కూల్చివేతలపై అధికార..ప్రతిపక్షం ట్విటర్ యుద్దం
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాతో చెరువుల పరిరక్షణకు..మూసీ ప్రక్షాళనకు చేపట్టిన ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలపై క్షేత్ర స్థాయి రాజకీయ సమరం కంటే సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్విటర్ యుద్దం ప్రజల్లో ఆసక్తిని రగిలిస్తుంది. హైడ్రా కూల్చివేతల పర్వం ప్రారంభించి బడాబాబుల ఆక్రమ నిర్మాణలను కూల్చివేసిన తొలి రోజుల్లో పొగడ్తలు అందుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం....మూసీ నది పరివాహకంలో పేదలు, మధ్యతరగతి ప్రజల నిర్మాణాల కూల్చివేత వద్దకు వచ్చేసరికి పొగడ్తల కంటే విమర్శలను, నిరసనలనే ఎక్కువగా ఎదుర్కోవాల్సివస్తుంది. ఇందుకు మూసీ నది పరివాహకంలో బడాబాబుల నిర్మాణాల కంటే పేద, మధ్యతరగతి ప్రజల నిర్మాణాలు అధికంగా ఉండటం ఒక కారణమైతే..బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాల దాడి మరో కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్ళి తమ పార్టీ వాదనకు అనుకూలంగా..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అంశాలతో.. బాధితుల గోడుతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం బాధితుల సమస్యలపై స్పందించి వారితో కలిసి ఆందోళనలు..పరామర్శల పేరుతో రాజకీయాన్ని వేడెక్కించడం కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాలకు మరింత పని కల్పించగా.. వారు ప్రభుత్వంపై ట్విటర్ దాడిని మరింత ముమ్మరం చేశారు. దీంతో సదుద్ధేశంతో చేపట్టిన మూసీ ప్రక్షాళన ఆపరేషన్ కాస్తా రాజకీయ క్రీడగా మారిపోయింది.

ఈ పరిస్థితిని..పొలిటికల్ గా జరుగుతున్న డ్యామేజ్ ని కొంత ఆలస్యంగా గ్రహించిన అధికార కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా బృందాలను అప్రమత్తం చేసింది. ఇంకేముంది...మూసీ ప్రక్షాళనకు, హైడ్రాకు అనుకూలంగా కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ లు, వ్యతిరేకంగా బీఆర్ఎస్ టీమ్ లు ట్విటర్ వేదికగా పోటాపోటీ వీడియోలు, ట్వీట్ల దాడులతో హోరెత్తిస్తున్నాయి. మూసీ ఆపరేషన్ బాధితుల విమర్శలను బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టు చేస్తుంటే..కౌంటర్ గా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ సహా వారు హైడ్రా, మూసీ ప్రక్షాళనను సమర్థిస్తు మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలలో మా ఓటమికి ప్రధాన కారణాల్లో తగినంత సోషల్ మీడియా బలం లేకపోవడమేనని వాపోయిన బీఆర్ఎస్ పార్టీ..మూసీ ప్రక్షాళన, హైడ్రా వివాదాలకు వచ్చేకల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచార దాడిలో కొంత కాంగ్రెస్ పై పైచేయి సాధించినట్లుగా గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed