- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్‌పై విద్యుత్ శాఖ ఫోకస్.. సాధ్యాసాధ్యాల పరిశీలన

దిశ, తెలంగాణ బ్యూరో: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భూగర్భ విద్యుత్ వ్యవస్థపై టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత విధానం కంటే భూగర్భ విద్యుత్ విధానమే శ్రేయస్కరమని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఆ దిశగా అడుగులు వేయాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించడంతో ఆఫీసర్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచిస్తుండటంతో ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థపై ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు.
ఓఆర్ఆర్ లోపల అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం!
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్కారు సూచిస్తోంది. విద్యుత్ కేబుల్స్‌తో పాటు ఇతరత్రా వివిధ రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం అరికట్టడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను అధిగమించొచ్చని సర్కారు భావిస్తోంది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించిన సమయంలోనూ భూగర్భ విద్యుత్ వ్యవస్థ అంశం తెర మీదికి వచ్చింది.
వేదికగా మేడ్చల్ మల్కాజిగిరి!
రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ విద్యుత్ వ్యవస్థను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచే ఈ పని ప్రారంభించాలంటే అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంటోంది. హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఇక్కడి నుంచి తొలి సారి ఏ జిల్లా వైపు వెళ్లాల్సి ఉంటుంది వంటి విషయాలను ఆఫీసర్లు చర్చిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానే ఇందుకు వేదిక అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. పెద్ద నగరాలు లేదా ఇతర దేశాల్లో విజయవంతంగా భూగర్భ విద్యుత్ వ్యవస్థ పనులను నిర్వహించిన సంస్థలకే అవకాశం కల్పిస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ శాఖ వెల్లడిస్తోంది. ఈ విషయంలో వివరాలన్నీ సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు సుమారు 500 వరకు ఉండగా, 33 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుళ్లు సుమారు 1,280 కి.మీ.ల వరకు ఉండగా, మరింతగా పెంచేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోనున్నారు.
సమ్మర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లకే ఎక్కువ టైం
వేసవిలో ట్రాన్స్‌ఫార్మర్ల రిపేరుకే అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఓవర్‌లోడ్ కారణంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మరమ్మతులతోనే తరచూ ఇబ్బందులు పడుతున్నామని, కేబుల్ వ్యవస్థ వస్తే ఈ సమస్యల నుంచి గట్టెక్కుతామని సిబ్బంది అంటున్నారు. ముఖ్యంగా ఈ వేసవిలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా పంపిణీ, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సూచిస్తోంది. వ్యవసాయపరంగా యాసంగి సీజన్ ముగియడంతో జిల్లాలలో విద్యుత్ డిమాండ్ తగ్గినప్పటికీ.. ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లో మాత్రం గణనీయంగా పెరుగుతోందని అధికారులు తెలియజేస్తున్నారు. గతేడాది మార్చి 20న జీహెచ్ఎంసీ పరిధిలో 3,300 మెగావాట్లుగా గరిష్ట డిమాండ్ నమోదు కాగా, తాజాగా 3,900 మెగావాట్లుగా నమోదయింది.