రైతుల శవాలతో రాజకీయాలా? రేవంత్ చాలెంజ్‌కు బీఆర్ఎస్ రిప్లై పై నెటిజన్ల ఫైర్

by Prasad Jukanti |
రైతుల శవాలతో రాజకీయాలా?  రేవంత్ చాలెంజ్‌కు బీఆర్ఎస్ రిప్లై పై నెటిజన్ల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం రైతాంగం చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోయారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చాలెంజ్ హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ చనిపోయిన రైతుల పేరుతో ఆరోపణలు చేయడం కాదని, ఆత్మహత్యలకు పాల్పడినవారి వివరాలు 48 గంటల్లో నివేదిక ఇస్తే ఆయా కుటుంబాలను ఆదుకుంటామని రేవంత్ సవాల్ విసిరారు. ఇందుకు కౌంటర్‌గా 209 మంది చనిపోయిన వారి జాబితాను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ షేర్ చేయగా ఇదిగో వివరాలు ఆదుకోండి.. అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్‌లో రీపోస్ట్ చేసి ప్రతి సవాల్ చేసింది. ఇప్పుడీ లిస్ట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. బీఆర్ఎస్ షేర్ చేసిన రైతుల జాబితాలో చాలావరకు తప్పుడు సమాచారం ఉందని ఇది రైతు ఆత్మహత్యల జాబితానా? రైతు మరణాల జాబితానా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

హరీశ్ రావు సైతం..

మాజీ మంత్రి హరీశ్ రావు సైతం ఇదే జాబితాను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారని, కరెంటు, నీళ్లు ఇవ్వాలని కోరారు. అయితే బీఆర్ఎస్ షేర్ చేస్తున్న ఈ జాబితాపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైతులకు అండగా ఉండటం అందరి బాధ్యత అని, ఇప్పుడు కరువు కారణంగా వాళ్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారనే మాట వాస్తవమే అయినా కుటంబ కలహాలు, అనారోగ్యం బారిన పడి చనిపోయిన వారి పేర్లను సైతం ఈ జాబితాలో చేర్చారని ఫైర్ అవుతున్నారు. జాబితాలోని వివరాలను వెల్లడిస్తూ వారు ఏ కారణాలతో చనిపోయారో వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేస్తున్నారు. రైతుల మరణాలపై రాజకీయమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో..

బీఆర్ఎస్ పేర్కొంటున్న జాబితాలో పలువురు వ్యక్తులు వ్యవసాయంలో నష్టాలకు బదులు ఇతర కారణాలతో చనిపోయినట్లు వివిధ దినపత్రికలు రిపోర్ట్ చేశాయి. ఆ పేపర్ క్లిప్పింగ్ లను షేర్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా హరీశ్ రావు పెట్టిన లిస్ట్‌లో 207 సీరియల్ నెంబర్‌తో ఉన్న పెద్ద లచ్చయ్య అనే వృద్ధుడు (78)క్షయ వ్యాధి వల్ల మనస్తాపంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని, 201 సీరియల్ నెంబర్‌లో ఉన్న మల్లారెడ్డి అనే రైతు ట్రాన్స్ ఫార్మర్ వద్ద షాక్ వల్ల, 209 సీరియల్ నెంబర్.. పిట్టల సంపత్ కూడా ఇలాగే మరణించారని, 202 సీరియల్ నెంబర్‌లో ఉన్న అమరవాది నర్సింహా రెడ్డి అనే రైతు మిరప చెట్లు తొలగించే పని చేస్తూ రోటోవేటర్ కింద పడి చనిపోయారని చెబుతున్నారు. అలాగే వీరిలో మరికొందరు కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకోగా వారి పేర్లను కూడా ఈ లిస్ట్‌లో చేర్చారంటున్నారు. గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ఆదాయం లేక రైతులు చనిపోయారని ఆరోపించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed