అన్ని పార్టీలది ఒకటే దారి!

by Disha Web Desk 16 |
అన్ని పార్టీలది ఒకటే దారి!
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పని చేసేలా రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో పనిచేయటం కష్టమే. దీంతో ఈ ప్రభావం పార్టీల గెలుపోటములపై ప్రభావం పడనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత మీదేనంటూ కార్యకర్తలు, నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారంతా ఉత్సాహంగా పనిచేసేలా గ్రామ నాయకులపై బాధ్యతలు ఉంచారు. కొద్దిరోజులుగా ప్రజల్లో తిరుగుతూ తాము మద్దతు ఇచ్చే పార్టీలకు ఓట్లు వేసేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. వారం రోజులుగా ఈ ప్రక్రియ ఊపందుకుంది.

ఆర్థికంగా అప్పగింతలు

ఎన్నికలలో డబ్బులు లేకుంటే పని జరగదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు గ్రామాలు, పట్టణాల్లో ద్వితీయ శ్రేణి నాయకులకు ఆర్థికంగా అప్పగింతలు పూర్తి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు చాలా వరకు డబ్బులు ఇప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని చెబుతున్నారు. గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు తిరుగుతుందటంతో ఎన్నికల సందడి నెలకొంది. నాయకులు సైతం విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి నాయకుల మద్దతుతో పాటు ఆర్థిక దన్ను అవసరం ఉంటుంది. ప్రతి గ్రామంలో నాయకులు ఎవరి ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తుండటం లోకసభ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్ధులకు కలిసి వస్తోంది.

పని చేసిన వారికే ప్రాధాన్యత

మరోవైపు నేతలు తమ గెలువు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై స్థానిక నాయకత్వం గట్టిగా పనిచేయించే బాధ్యతను పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పనిచేసిన వారికే ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్ని కల్లో ప్రాదాన్యం ఉంటుందని సంకేతాలిస్తున్నారు. పనిచేసిన వారికే స్థానిక ఎన్నికల సమయంలో ఆర్ధిక సహకారం అందిస్తామని చెబతున్నారు. గ్రామాలలో ఉండే నాయకులు సైతం నేతల దృష్టిలో పడేందుకు సిద్ధం అవుతున్నారు. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సీట్లు ఆశించే వారు ఇప్పటి నుంచే నాయకుల దృష్టిలో పడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి వారే ఎక్కువగా ఇప్పుడు సమావేశాలకు హాజరవుతున్నారు. తమ వెంట కార్యకర్తలు, నాయకులను తీసుకుని వస్తున్నారు. ఇటీవల మూడు ప్రధాన పార్టీల నాయకులు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేతలు, కార్యక్తలకు దిశా నిర్దేశనం చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించి ఎంపీ ఎన్నికలలో గెలిచేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసి ముందుకు సాగుతున్నాయి.

Next Story