ఈడీ దాడులు కాదు.. బీజేపీ దాడులే: పిడమర్తి రవి

by Gantepaka Srikanth |
ఈడీ దాడులు కాదు.. బీజేపీ దాడులే: పిడమర్తి రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూబ్లీహిల్స్ నివాసం, హిమాయత్ సాగర్ సమీపంలోని ఫామ్ హౌజ్‌తో పాటు ఆయన కుమార్తెకు చెందిన జూబ్లీహిల్స్ ఇల్లు, ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఆఫీసు, ఆయన కుమారుడు రాఘవ నివాసం... ఇలా మొత్తం 16 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించాయి. నగరంలోని ఈడీ రీజినల్ కార్యాలయంతో సంబంధం లేకుండా జరిగిన ఈ తనిఖీలు ఎందుకోసం జరిగాయో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో అధికారికంగా ఈడీ ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబరు 3న ఈడీ, ఐటీ అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తులపై తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు హఠాత్తుగా ఈడీ మరోసారి సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

హవాలా మార్గం ద్వారా జరిగిన రూ. 100 కోట్ల మేర లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఈడీ సోదాలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నా ఈడీ అధికారులు మాత్రం తనిఖీలు పూర్తయిన తర్వాతనే వివరాలను వెల్లడించనున్నట్లు ఢిల్లీ హెడ్ క్వార్టర్ నుంచి ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో హాంకాంగ్ నుంచి సింగపూర్ మార్గం మీదుగా హవాలా రూపంలో సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన రిస్టు వాచీలను పొంగులేటి కుమారుడు రాఘవ తెప్పించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అప్పట్లో డీఆర్ఐ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి చెన్నై నగరానికి చెందిన డీలర్ ముబెన్‌ను ఫిబ్రవరిలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించిందని, అతని నుంచి రూ. 1.73 కోట్ల మేర నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వవ్చాయి. నవీన్ అనే మరో మధ్యవర్తిని మార్చి నెలలో అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా సుమారు రూ. 100 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వార్తలు వచ్చినా కస్టమ్స్ అధికారులు ధృవీకరించలేదు.

ఈడీ దాడులు కాదు.. బీజేపీ దాడులు : పిడమర్తి రవి

గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి నివాసాల్లో సోదాలు చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకేసారి 16 చోట్ల తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాక్షేత్రంలో పొంగులేటిని ఎదుర్కోలేకనే ప్రధాని మోడీ ఈడీ ద్వారా ఈ దాడులు చేయిస్తున్నరని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. ఇలాంటి దాడులు ఆయన ప్రజాదరణను తగ్గించలేవని, ప్రజల నుంచి ఆయనను దూరం చేయడం బీజేపీ దాడులతో సాధ్యం కాదన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క బీజేపీ నాయకునిపైనా ఇప్పటివరకు ఈడీ దాడులు జరగలేదని గుర్తుచేశారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరులు బీజేపీ నాయకులేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఈడీతో దాడులు చేయించడం, అసత్య ఆరోపణలతో రాజకీయంగా బురద జల్లడం ఒక అలవాటుగానే అలవాటుగా మారిందన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ.. ఇలా ప్రతిపక్షాల నేతలపై ఈడీ, ఐటీ దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు.

బీజేపీ మార్కు పాలిటిక్స్‌కు పరాకాష్ట : అద్దంకి దయాకర్

బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యుల, బంధువుల ఇండ్లపై ఈడీ దాడులని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టడానికి, వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న కుట్ర అని అన్నారు. సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని కూడా భయపెట్టడానికి బీజేపీ గతంలో నిరంతరం దాడులు చేయించిందని, పొరుగున ఉన్న కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పైనా ఇలాంటి దాడులే జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని, ఇందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ ఆస్తులపై ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది బీజేపీ మార్క్ రాజకీయానికి పరాకాష్ట అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed