- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కొత్త అలజడి.. ప్రభుత్వ ప్రోద్బలంతోనే టార్గెట్!
'ప్రభుత్వాలు నా ఐ-ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండమని యాపిల్ కంపెనీ నన్ను హెచ్చరించింది'
- ఆర్ఎస్పీ ట్వీట్ (జనవరి 01, 2023)
'నాకు తెలియకుండానే నా ఫోన్ టాపింగ్ అవుతున్నది. నా ఫోన్ కాల్స్ మొత్తం టాపింగ్‌లో ఉన్నాయి. ఇది ఒక అప్రజాస్వామిక చర్య. తెలంగాణ రాష్ట్రంలో ఇది చోటుచేసుకుంటున్నది. గవర్నర్‌గా ఉండి కూడా నా ఫోన్ టాపింగ్‌కు అతీతంగా లేదు. నాకు బలమైన అనుమానమే ఉన్నది'
- గవర్నర్ తమిళిసై (నవంబరు 9, 2022, రాజ్‌భవన్‌లో మీడియాతో)
'మీ ఫోన్‌ను 'స్పేట్ స్పాన్సర్డ్ ఎటాకర్' టార్గెట్ చేస్తున్నారు. మీ యాపిల్ ఐడీ ద్వారా మీ ఫోన్‌ను రిమోట్‌లో వారి కంట్రోల్‌లోకి తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోండి'
- ఆర్ఎస్పీకి యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన మెయిల్
దిశ, తెలంగాణ బ్యూరో: తన ఐ ఫోన్‌ను హ్యాక్ చేస్తున్నారంటూ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్ చేశారు. యాపిల్ కంపెనీ నుంచి గత నెలలో ఈ-మెయిల్ ద్వారా వచ్చిన మెసేజ్‌ను ట్వీట్‌లో జతపరిచారు. మీ ఫోన్ ను టార్గెట్ చేస్తున్నారని, విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ ఆ మెసేజ్‌లో యాపిల్ సంస్థ ఆర్ఎస్పీని హెచ్చరించింది. ప్రభుత్వ స్పాన్సర్డ్ ఎటాకర్ ఎవరనేది స్పష్టంగా కంపెనీ ప్రస్తావించకపోయినా పరోక్షంగా సంకేతమిచ్చింది. ఈ మెసేజ్‌ను ఆలస్యంగా చూసుకున్న ఆర్ఎస్పీ వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను, తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. తన ఫోన్ ను సైతం ట్యాప్ చేస్తున్నారని 2022 నవంబర్ 9న రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ సైతం సంచలన కామెంట్స్ చేశారు. 'మొయినాబాద్ ఫాంహౌజ్ కేసులో అనవసరంగా నా పేరును, రాజ్‌భవన్‌ను వివాదంలోకి లాగింది బీఆర్ఎస్. ఈ కేసులో ప్రమేయం ఉందన్న అనుమానంతో తుషార్‌తో రాజ్‌భవన్‌కు లింకు పెట్టింది. తుషార్ నాకు ఏడీసీ. దీపావళి పండుగ సందర్భంగా విష్ చేసిన రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్ ఈ కామెంట్ చేసింది. అందుకే నా ఫోన్‌ను టాపింగ్ చేస్తున్న అనుమానం ఏర్పడింది' అని గవర్నర్ వివరించారు.
ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్ కామెంట్
'యాండ్రాయిడ్ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా దిగజారి ప్రవర్తిస్తున్నది. పార్టీలో అంతర్గత సమాచారం పార్టీ నేతలకంటే ముందే బీఆర్ఎస్‌కు తెలిసిపోతున్నది. అందుకే అందరూ ఐ-ఫోన్లను వాడండి. సమాచారం లీక్ కాకుండా సేఫ్‌గా ఉంటుంది' అని డిసెంబరు 16న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పార్టీ శ్రేణులకు సూచించారు. చాలాకాలం పాటు యాండ్రాయిడ్ ఫోన్ వాడిన బండి సంజయ్.. ఇటీవలే ఐ-ఫోన్‌ను వాడడం మొదలు పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం ఫోన్లను టాపింగ్ చేస్తున్నదనేదే పై ముగ్గురు నేతల ఆందోళన. యాండ్రాయిడ్ ఫోన్లు హ్యాకింగ్‌కు, ట్యాపింగ్‌కు లోనవుతాయని, వీటితో పోలిస్తే ఐ-ఫోన్ నయమనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. ఆ అభిప్రాయంతోనే బండి సంజయ్ తన పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. కానీ ఐ-ఫోన్ వాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్పీకి సైతం ట్యాపింగ్ బాధ తప్పలేదు. స్టేట్ స్పాన్సర్డ్ ఎటాకర్ టార్గెట్ చేస్తున్నారంటూ ఆయనను యాపిల్ కంపెనీ అప్రమత్తం చేసింది. ఐ-ఫోన్ సైతం టాపింగ్‌కు, హ్యాకింగ్‌కు అతీతమేమీ కాదనే ఆర్ఎస్‌పీ ట్వీట్‌తో తేలిపోయింది. ప్రభుత్వం తల్చుకుంటే యాండ్రాయిడ్ అయినా, ఐ ఫోన్ అయినా ఒకటేననే ఆందోళన ఇప్పుడు మొదలైంది. ఇంతకాలం ఐ-ఫోన్లు సేఫ్ అనే అభిప్రాయం ఎలా ఉన్నా సాక్షాత్తూ యాపిల్ కంపెనీయే ఆర్ఎస్‌పీని మెయిల్ ద్వారా అలర్టు చేయడం ఆ ఫోన్లు వాడుతున్న వినియోగదారుల్లోనూ అలజడికి కారణమైంది.
యాపిల్ కంపెనీ మెసేజ్‌లో..
'స్టేట్ స్పాన్సర్డ్ ఎటాకర్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ యాపిల్ ఐడీ ఆధారంగా మిమ్మల్ని రిమోట్ ద్వారా వారి కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా మీరెవరో, మీరు ఏం చేస్తున్నారో తెలిసిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ ఐ-ఫోన్ కంట్రోల్ వారి చేతుల్లోకి పోయే అవకాశమున్నది. ఫోన్‌లోని సెన్సిటివ్ డేటా, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్, స్టోరేజీ తదితరాలన్నింటినీ రిమోట్‌లో వారు ఆపరేట్ చేసే అవకాశమున్నది. దీన్ని 'ఫాల్స్ అలారం'గా భావించొద్దు. సీరియస్‌గా తీసుకోండి. ఇప్పటికే మీకు ఇలాంటి 'త్రెట్ మెసేజ్' వచ్చి ఉంటే ఇప్పుడు పంపుతున్నదాన్ని దానికి కొనసాగింపుగా వచ్చిందని భావించండి' అంటూ ఈ-మెయిల్ మెసేజ్‌లో యాపిల్ కంపెనీ ఆర్ఎస్పీని అలర్ట్ చేసింది.
అలర్ట్ ఎప్పుడు, ఎందుకు వస్తుంది?
ఐ-ఫోన్ వినియోగదారులను యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. సైబర్ క్రిమినల్స్ తరచూ ఫోన్‌లకు కొన్ని మెసేజ్‌లు పంపుతూ హ్యాకింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటారని కంపెనీ సపోర్టు టీమ్ జనరల్ అలర్ట్ ఇస్తూ ఉంటుంది. కానీ 'స్టేట్ స్పాన్సర్డ్' ఎటాకర్లు మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే ఎంపిక చేసినవారిని టార్గెట్ చేస్తూ ఉంటారని, వినూత్న పద్ధతుల్లో వారికున్న వనరుల మేరకు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఎటాకర్లకు ఫండింగ్‌తో పాటు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని, అందువల్ల హ్యాకింగ్ చేస్తున్న విషయం కూడా అర్థం కాదని, వాటిని నివారించడం కూడా కష్టమని అలర్ట్ చేస్తుంది. ఇలాంటివి గమనంలోకి వచ్చినప్పుడు వినియోగదారులను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెసేజ్‌ల ద్వారా అలర్టు చేయడాన్ని కంపెనీ ఒక నియమంగానే పెట్టుకున్నది. తాజాగా ఆర్ఎస్పీ విషయంలోనూ ఇలాంటి వార్నింగ్‌నే యాపిల్ కంపెనీ మెయిల్ ద్వారా పంపింది. ఈ మెసేజ్‌ను చూసుకున్న ఆయన ఒకింత ఆందోళన చెందినా ట్వీట్‌లో మాత్రం ప్రభుత్వానికి (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం) గట్టి వార్నింగ్‌నే ఇచ్చారు. 'మీ లాగా నేను నా ఫోన్‌ను ధ్వంసం చేయను. కానీ మీ దోపిడీ, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి మహనీయులు కలలుగన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా' అంటూ ట్వీట్ ద్వారా స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. ఆ ట్వీట్‌ను చూసిన ఆయన అభిమానులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటుగానే స్పందించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
చాలా సందర్భాల్లో..
ఐ-ఫోన్ ట్యాపింగ్‌కు, హ్యాకింగ్‌కు లొంగుతుందా? లేదా? అనే అనుమానాలు ఎలా ఉన్నా.. ఆ ఫోన్‌ను తయారుచేసిన కంపెనీయే యూజర్‌ను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు పాటించాలంటూ హెచ్చరించడం గమనార్హం. రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో ప్రభుత్వం.. ఫోన్లును ట్యాపింగ్ చేస్తున్నదని విమర్శలు చేశారు. రాష్ట్ర హైకోర్టులో మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు విచారణ సందర్భంగానూ నిందితుల తరఫున జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వ ఫోన్ టాపింగ్ ప్రస్తావన వచ్చింది. నిందితుల తరఫున ఉదయ్ హొల్లా వాదిస్తూ, గవర్నర్ సైతం ఫోన్ టాపింగ్‌పై అనుమానాన్ని వ్యక్తం చేశారని గుర్తుచేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తన తీర్పులో అర్నేశ్ కుమార్ వర్సెస్ బిహార్ కేసు ఉదంతాన్ని ప్రస్తావించి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ సంభాషణలను ట్యాపింగ్ ద్వారా వినడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫోన్ టాపింగ్‌పై జరుగుతున్న వివాదాల సమయంలో యాపిల్ కంపెనీ నుంచి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్‌పీకి హెచ్చరిక రావడం గమనార్హం. ప్రభుత్వం తలుచుకుంటే ఐ-ఫోన్లను సైతం నియంత్రించగలుగుతుందనే ఆందోళన ఈ మెసేజ్ తర్వాత ఆర్ఎస్పీతో సహా ప్రతిపక్ష నేతల్లోనూ మొదలైంది.
Also Read...
ఏపీలో BRS పోటీ చేసే స్థానాలివే.. Minister Mallareddy క్లారిటీ