తెలంగాణలో సంచలనం.. రూ.వేల కోట్ల విలువజేసే భూమిని ఇలా చేశారేంటి?

by Gantepaka Srikanth |
తెలంగాణలో సంచలనం.. రూ.వేల కోట్ల విలువజేసే భూమిని ఇలా చేశారేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్ల విలువైన విలువైన భూములను అప్పనంగా అప్పగించేశారు. వందల ఎకరాలను ప్రైవేటుపరం చేశారు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లో చేరాయి. మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలం శంషీగూడ సర్వే నం.57లో 92 ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని రాష్ట్ర విశ్రాంత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ యూనియన్ ఆరోపించింది. అక్రమార్కుల నుంచి వాటిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూములను రక్షించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీవాత్సవకు ఆధారాలతో సహా లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కు అత్యంత సమీపంలోనే, చుట్టూ హై రైజ్డ్ బిల్డింగులు ఉండడంతో ఈ భూముల విలువ అమాంతం పెరిగింది. ఈ భూములపై ఎన్నెన్నో కేసులు నడిచాయి. ఇంకా అనేకం పెండింగులోనే ఉన్నాయి. కానీ ఆ భూములను ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలు చేజిక్కించుకోవడంలో సహకరించిన ఐఏఎస్, రెవెన్యూ అధికారులు ఎవరనే చర్చ జరుగుతున్నది.

కూకట్ పల్లి నుంచి శంషీగూడకు..

కూకట్‌పల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నం.1 నుంచి 274 వరకు ఉండేవి. దాని ఆవాస గ్రామంగా శంషీగూడ ఉండేది. సర్వే నం.274లోని 274.33 ఎకరాలు పొరంబోకు భూమి (సర్కారీ)గా రికార్డుల్లో ఉన్నది. శంషీగూడను ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేశారు. 1 నుంచి 205 వరకు కూకట్‌పల్లికి, 206 నుంచి 274 వరకు శంషీగూడకు కేటాయించారు. శంషీగూడకు వచ్చిన మొత్తం సర్వే నంబర్ల సంఖ్య 68. అందుకే ఒకటి నుంచి పరిగణిస్తూ 57 వరకే లెక్కించారు. మిగిలిన 11 సర్వే నంబర్లకు చెందిన భూమి ఎలా సర్దుబాటు చేశారో నేటికీ అంతు చిక్కని అంశం. సర్వే నం.274లోని ప్రభుత్వ భూమి శంషీగూడ రెవెన్యూకు మారిన తర్వాత సర్వే నం.57గా మారింది. అయితే ఈ భూమి 1959 నాటి ప్రిలిమినరి డిక్రీతో యజమానులం తామేనంటూ భూ దందాకు తెర లేపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల అండదండలతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు రెవెన్యూ శాఖలో చక్రం తిప్పాయి. సీఎస్ 7 ల్యాండ్ గా దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న ఇందులోనే 92 ఎకరాలు కొట్టేశారని రిటైర్డ్ అధికారులు ఆరోపిస్తున్నారు.

తెర వెనక ఎమ్మెల్సీ?

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ ఎమ్మెల్సీ ఈ భూములను ప్రైవేటుపరం చేయడంలో కీలకపాత్ర పోషించాడనే ప్రచారం జరుగుతున్నది. ఐఏఎస్, ఐపీఎస్, మున్సిపల్ ఆఫీసర్ల బదిలీల్లోనూ కలుగజేసుకునే ఆయన.. పనులు చేసి పెట్టేందుకు తనకు నచ్చిన అధికారులను అనుకున్న చోట ట్రాన్స్ చేయించేవారని రెవెన్యూ వర్గాల్లో చర్చ ఉన్నది. అందుకే దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను ప్రైవేటుగా మార్చి.. పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించారని తెలిసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు క్లియరెన్స్ ఇప్పించడం, ట్రాన్సాక్షన్స్ జరగడం, తిరిగి పీవోబీలో నమోదు చేయడం వంటివి చకచకా జరిగేవని సమాచారం.

హైకోర్టులో కేసు ఇలా..

1958 కంటే ముందు నవాబ్‌ మొయినుద్దీన్‌ బహదూర్‌ కూతురు సహబ్జాది సుల్తాన్‌ జహాన్ బేగం, నవాబ్‌ జహీర్ యార్ జంగ్ బహాదూర్ తదితరుల మధ్య హైకోర్టులో కేసు నడిచింది. సీఎస్ 7/1958 (అప్లికేషన్‌ నంబర్లు 126, 129, 130, 131, 133) కింద ప్రిలిమినరీ డిక్రీని ఓ వర్గం పొందింది. దాంట్లో భాగంగా బహదూర్‌పురాలో ఇమ్లీమహల్‌ గార్డెన్‌, అమ్జాద్‌ ఉద్‌ దావ్లా గార్డెన్‌, బొల్లారం, టోలీచౌక్‌, ఆసిఫ్‌నగర్‌, బాగ్‌అంబర్‌పేట, శంషాబాద్‌, లాలాగూడ, శివరాంపల్లి, బాలాపూర్‌, రాయదుర్గం, సోమాజిగూడ, అమ్జద్ నగర్, సంఘిగూడ, అలీసాహెబ్‌, ఎల్లమ్మకుంట, ఎర్రవాడ, శంషీగూడ, రాయసముద్రం, రోషన్‌దౌలా, మూసారాంబాగ్‌ భూములపై హక్కులు సంపాదించారు. అయితే అంతకు ముందే రికార్డుల్లో పొరంబోకు-సర్కారీగా ఉంది. ఇరువర్గాల మధ్య ఓ ప్రభుత్వ భూమిపై పోరాటం సాగించడం గమనార్హం. ఈ కేసుల్లో ప్రభుత్వాన్ని అంటే రెవెన్యూకు చెందిన తహశీల్దార్‌/కలెక్టర్‌/ప్రిన్సిపల్‌ సెక్రటరీని పార్టీగా చేయలేదు. కేవలం రెండు ప్రైవేటు వర్గాలు లేదా ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌గానే వివాదంగానే కొనసాగినట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొన్ని కేసుల్లో ఏ సంబంధం లేని ఫైనాన్స్‌ సెక్రెటరీని పార్టీగా చూపినట్లు తెలిసింది. జాగిర్దార్లు ప్రిలిమినరీ డిక్రీ ద్వారా కోటలు, ప్యాలెస్ లు, తోటలు, ఇండ్లు, మల్గీలు, భూములు, జాగీర్లు తమవంటూ కోర్టు నుంచి 1959లో ప్రిలిమినరీ డిక్రీని పొందారు. ఆ తర్వాత సరిహద్దులు, విస్తీర్ణం గుర్తించడం, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించడం వంటి ప్రక్రియ చేపట్టలేదు. అవన్నీ పూర్తయితేనే ఫైనల్‌ డిక్రీ పొందినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఫైనల్ డిక్రీ పొందకుండా..

శంషీగూడ భూముల్లో డిక్రీ పొందిన తర్వాత 50 ఏళ్ల పాటు యజమానులుగా చెబుతున్న వారు ఇంత కాలం ఎందుకు ముందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఫైనల్‌ డిక్రీ పొందేందుకు కనీస ప్రయత్నమూ చేయలేదు. ఈ లోగా ప్రభుత్వం ఆ భూములను ప్రజాప్రయోజనాల కోసం వినియోగించింది. పేదలకు పట్టాలు ఇచ్చింది. దాంతో పాటు ఎన్టీఆర్‌నగర్‌, దత్తాత్రేయకాలనీ, పీజేఆర్‌నగర్‌, తంగరాజుబస్తీ, ఎల్లమ్మబండ, జన్మభూమి కాలనీ, ఇంద్రానగర్‌, సాయిచరణ్‌ కాలనీ, మహంకాళినగర్‌, ఇంద్రాహిల్స్‌, శివాజీనగర్‌, ఆశయ్యనగర్‌, ఆదర్శనగర్‌, శ్రీరాంనగర్‌కాలనీ, కృష్ణవేణినగర్‌, మొగులమ్మబస్తీ, కమలమ్మబస్తీ, శివమ్మబస్తీ, అంబేడ్కర్ నగర్ వంటివి అనేకం ఏర్పడ్డాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ఇండ్లు నిర్మించారు. ప్రభుత్వం దీంట్లో నుంచి 100 ఎకరాలకు పైగానే హుడాకు కేటాయిస్తే లేఅవుట్లు చేసి విక్రయించింది. 2000 సంవత్సరం తర్వాత హక్కుదారుల నుంచి తాము కొన్నామంటూ పెద్దలు రంగ ప్రవేశం చేశారు. వాళ్లూ మరికొందరికి విక్రయిస్తూ దందాను విస్తృతం చేశారు. ఖాళీగా ఉన్న 92 ఎకరాలను పెద్దలకు కట్టబెట్టారని తెలిసింది. ఈ అంశంపై ఏ రెవెన్యూ అధికారిని అడిగినా రిప్లయ్ ఇవ్వడం లేదు.

రిజిస్ట్రేషన్ అధికారం ఉందా?

శంషీగూడ భూములను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూకట్‌పల్లి తహశీల్దార్‌కు ఉందా? అన్న సందేహం కలుగుతుంది. 2020 అక్టోబర్ 28న జారీ చేసిన జీవో 118 ప్రకారం కూకట్‌పల్లి తహశీల్దార్‌ను జాయింట్ రిజిస్ట్రార్‌గా గుర్తించలేదు. అలాంటప్పుడు ఈ భూములను సదరు తహశీల్దార్ ఏ హోదాలో, ఏ అధికారంతో రిజిస్ట్రేషన్ చేశారన్న అనుమానాలున్నాయి. మేడ్చల్ జిల్లాలో అల్వాల్, బాచుపల్లి, దుండిగల్, ఘట్‌కేసర్, కాప్రా, కీసర, మేడ్చల్, మేడిపల్లి, మూడు చింతలపల్లి, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట, ఉప్పల్ కార్యాలయాలను మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తించారు. అలాంటప్పుడు ఎవరు కట్టబెట్టిన అధికారంతో కూకట్‌పల్లి తహశీల్దార్ వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేశారన్న అంశంపై విచారణ చేయాలని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఒకరు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed